దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వేడుకగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గల స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలు వేడుకగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోట వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రకోట వద్ద గల జ్ఞానపథ్ ప్రాంతంలో పుష్పాలంకరణ చేశారు. G20 లోగోను ఏర్పాటు చేయడం విశేషం. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో 1100 మంది విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్లు పాల్గొనగా ఎర్రకోటవద్ద ఢిల్లీ పోలీసులు, త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు.
ఎర్రకోటలో ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి గిరిధర్బీ అరమానే స్వాగతం పలుకగా ఢిల్లీ ప్రాదేశిక లెఫ్టినెంట్ జనరల్ (జిఒసి) ధీరజ్ సేఠ్ ప్రధానికి రక్షణశాఖ కార్యదర్శిని పరిచయం చేశారు. ఈ వేడుకల్లో (Independence Day) సైనిక బలగాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించి తన సందేశాన్ని వినిపించారు.
గౌరవ వందన కవాతు బృందంలో ఆర్మీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసు విభాగం నుంచి ఒక్కొక్క అధికారితోపాటు 25 మంది సిబ్బంది, నావికాదళం నుంచి ఒక అధికారితోపాటు 24 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది కవాతు సమన్వయ బాధ్యతను భారత సైన్యం నిర్వర్తించడం విశేషం. గౌరవ వందనానికి మేజర్ వికాస్ సంగ్వాన్ నాయకత్వం వహించగా, ప్రధానమంత్రి రక్షణ బృందంలోని సైనిక సిబ్బందికి మేజర్ ఇంద్రజీత్ సచిన్, నావికాదళానికి లెఫ్టినెంట్ కమాండర్ ఎం.వి రాహుల్ రామన్, వైమానిక దళానికి స్క్వాడ్రన్ లీడర్ ఆకాష్ గంగాస్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. వీరుల బలిదానంతో స్వాతంత్య్రం వచ్చిందని, మణిపూర్లో త్వరలోనే శాంతి నెలకుంటుందన్నారు. చిన్న సమస్యలే ఇబ్బందిగా మారుతున్నాయని, అవన్నీ కూడా మటుమాయం అయిపోతాయన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పతకావిష్కరణ చేయడం ఇది పదోసారి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు నిర్వహించింది. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.