ఆస్కార్ పురస్కారం సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్. ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకోవడంపై భారతదేశం ఉప్పొంగుతోంది. తెలుగు సినిమా గర్విస్తోంది. అవార్డు అందుకున్న ఆనందంలో ఆ చిత్ర బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. కాగా భారతదేశానికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో కూడా ఆస్కార్ దక్కింది.
భారతదేశం ఉప్పొంగుతోంది
తెలుగు సినిమా గర్విస్తోంది
త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది
మన సినిమా ప్రపంచ ఖ్యాతి పొందుతోంది
ప్రపంచ వేదికపై తెలుగు సినిమా (Tollywood) సగర్వంగా నిలిచింది. ప్రపంచాన్ని ఊపేసిన మన ఊరమాస్ పాట ‘నాటు నాటు’ (Natu Natu Song) విశ్వంలోనే ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ (Oscar Award) ను సొంతం చేసుకుంది. శతాబ్ద కాలంగా భారతీయ సినిమా (Indian Cinema)కు ఆస్కార్ దాహాన్ని ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా తీర్చేసింది. ఆస్కార్ పురస్కారం సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్. ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకోవడంపై భారతదేశం ఉప్పొంగుతోంది. తెలుగు సినిమా గర్విస్తోంది. అవార్డు అందుకున్న ఆనందంలో ఆ చిత్ర బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. కాగా భారతదేశానికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో కూడా ఆస్కార్ దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ (Best Documentary Short Film)గా కార్తీకి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers) సొంతం చేసుకుంది. ఈ పురస్కారాలు దక్కడంపై భారత ప్రధాని మొదలుకుని కుగ్రామంలోని సగటు సినిమా అభిమాని గర్విస్తున్నాడు.
ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao), ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT Rama Rao), ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అన్ని భాషల సినీ ప్రముఖులతో పాటు పలు రంగాల దిగ్గజాలు చిత్ర బృందాన్ని అభినందించారు. తెలుగు సినిమాను ప్రపంచానికి చాటిన ఘనత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి దక్కుతుందని అభినందించారు. అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్కార్ వేదికపై ప్రదర్శన ఇచ్చిన తెలంగాణ యువకుడు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకు అభినందనలు తెలిపారు.
‘ఆస్కార్ అవార్డు రావడంతో భారతదేశం గర్వపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటు నాటు పాట చిరకాలం గుర్తుండిపోతుంది. ఎంఎం కీరవాణి, చంద్రబోస్ తో పాటు చిత్రబృందానికి అభినందనలు’
– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో #RRR లోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయం. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.’
– ఎం. వెంకయ్య నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి
విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తెలుగు వారికి గర్వకారణం. నాటునాటు పాట తెలంగాణ సంస్కృతి.. తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనం. తెలుగు మట్టి వాసనలను వెలుగులోకి తీసుకువచ్చిన రచయిత చంద్రబోస్, ఎంఎం కీరవాణి, రాజమౌళి, నటీనటులందరికీ అభినందనలు.
– కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి
భారతీయ జెండా రెపరెపలాడుతోంది. తెలుగు పాట అవార్డు అందుకోవడంపై ఎంతో గర్విస్తున్నా. అంతర్జాతీయ వేదికపై మన జానపదం ఇంత గుర్తింపు సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు.
-వైఎస్ జగన్, ఏపీ ముఖ్యమంత్రి
‘అకాడమీ అవార్డులలో ఉత్తమ ఒరిజినల్ పాటగా అవార్డును దక్కించుకుని నాటునాటు ఖ్యాతి గడించింది. భారతీయ సినిమాకు గర్వించే ఘడియలు ఇవి. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, చంద్రబోస్ లకు శుభాకాంక్షలు.
– నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత
‘నాటు నాటు అందించిన గౌరవంలో కోట్లాది మంది భారతీయులతో పాటు నేను భాగమవుతున్నా. కీరవాణి, చంద్రబోస్ చరిత్ర సృష్టించారు. రాజమౌళి భారతదేశాన్ని గర్వించేలా చేశారు. నా సోదరులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తూనే ఉండండి. అద్భుతంగా పని చేసిన నాటునాటు సినిమా బృందానికి అభినందనలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. షాట్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు కొల్లగొట్టిన ‘ది ఎలిఫంట్ విష్పర్స్’ బృందానికి కూడా మంత్రి కేటీఆర్ అభినందించారు. అద్భుతమైన విజయమంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘అద్భుతం. భారతదేశం గర్వించే క్షణాలు ఇవి. అందరి నమ్మకాలను నిజం చేస్తూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ ను సాధించింది. ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు’
– నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
–
ఇక వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తదితరులు అభినందించారు. ఇక మహేంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహేంద్ర చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.