ఒకప్పుడు జై, గౌతమ్ SSC, చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన నవదీప్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెకెక్కిన తాజా వెబ్ సిరీస్ న్యూసెన్స్(Newsence web series). నేడు(మే 12న) ఆహా ఓటీటీలో విడుదలైంది. జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ లో డిఫరెంట్ కంటెంట్‌తో విడుదలైన ఈ సినిమాలో బిందు మాధవి కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన టీజర్లు, పోస్టర్లకి మంచి స్పందన రావడంతో ఈ వెబ్ సిరీస్ పై హైప్ నెలకొంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చుద్దాం.
వెబ్ సిరీస్ – న్యూసెన్స్ నటీనటులు – బిందుమాధవి, నవదీప్ తదితరులు దర్శకుడు – శ్రీ ప్రవిన్ కుమార్ నిర్మాత – TG.విశ్వ ప్రసాద్ విడుదల తేదీ – మే 12, 2023
న్యూసెన్స్ వెబ్ సిరీస్(Newsence web series) మొత్తం 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆసక్తిరేకెత్తించే సన్నివేశాలతో కట్టిపడేశారు. 1990- 2000 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ప్రెస్ క్లబ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఉదయాన్నే పేపర్ చూసి.. సాయంకాలం వేళ టీవీలో వార్తలు చూసేదే నిజం అనుకునే జనాల అమాయకత్వపు ఆలోచనలను స్టోరీగా మలిచి ఈ సినిమా రూపొందించారు.
కథ
తన భార్య కట్నంగా తెచ్చిన ఓ పేదవాడి భూమిని బడా పొలిటీషియన్స్ ఆక్రమించుకోవడం, ఆ భూమిని కాపాడుకోవడానికి పోలీసులు, ప్రభుత్వ అధికారులతో పాటు జర్నలిస్టుల సాయం కోసం ఆ పేదవాడు ఎదురుచూసి చివరకు హత్య చేయడం జరుగుతుంది. అధికారంలో ఉన్న పొలిటీషియన్ కరుణాకర్ రెడ్డి, అధికారం కోసం ఎదురుచూస్తున్న మరో పొలిటీషియన్ నాగిరెడ్డి నడుమ వైరం..ఈ వైరంలో ఎవరెవరు ఎలా బలయ్యారు? సమాజంపై ఈ ప్రభావం ఎలా పడింది? ఇందులో జర్నలిస్టులు నవదీప్ అతని టీమ్ పాత్ర ఏంటి? చివరకు సమాజం దృష్టిలో జర్నలిస్టులు ఎలా చూడబడ్డారు అనేది కథ. ఊర్లోని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వల్ల హీరో శివ సమస్యల్లో చిక్కుకుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ట్విస్ట్.
ఎలా ఉందంటే
మీడియా రంగంపై వచ్చే సినిమాలు చాలా అరుదు. అయితే జర్నలిజం పోకడ, సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎలా ఉంది అని తెలిసేలా మదనపల్లి రియల్ ఇన్సిడెంట్ తీసుకొని ఈ సినిమా ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రస్తుత సమాజంలో మీడియాకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? డబ్బున్నోళ్ళు మీడియాను కొనేస్తున్నారా? అనే పాయింట్స్ చూపిస్తూ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా ముందుకు తీసుకెళ్లారు. డబ్బు, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు? చివరకు నిజాలను దాచేసి వాళ్లకి అనుగుణంగా ఎలా మార్చుకుంటున్నారు? ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాల్సిన మీడియా, జర్నలిస్టులు డబ్బుకు అమ్ముడుపోతున్నారా? న్యూస్ కవరేజ్ కోసం డబ్బులు ఎలా చేతులు మారతాయి? అనే విషయాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
మీడియాలో స్ట్రింగర్స్ గా పిలవబడే జర్నలిస్టులు, పోలీసుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి? అనే విషయాలను సన్నివేశాలుగా మలిచి ప్రేక్షకులకు రియల్ ఫీల్ తెప్పించారు. ఈ రోజుల్లో న్యూస్ అనేది న్యూసెన్స్ గా ఎందుకు మారుతుంది? దాని వెనుక జరిగే తతంగాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. మిస్సింగ్ కేసులు, భూ ఆక్రమణలు, రాజకీయ నాయకులు చేయించే మర్డర్స్, జర్నలిస్టులు పోలీసుల మధ్య రిలేషన్ లాంటి సబ్జెక్ట్స్ టచ్ చేస్తూ ఎక్కడా బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా డబ్బుకు మీడియా దాసోహమేనా? అనే పాయింట్‌తో కథ నడిపించారు. ఇది సీజన్ వన్ అని చివరలో చెప్పిన మేకర్స్..ఈ ఫస్ట్ సీజన్ కథలో చిన్న భాగమేనని సీజన్ 2లో మరిన్ని విషయాలు టచ్ చేయనున్నట్లు తెలిపారు.
చివరిగా
మనిషి నిజానికి భయపడిన ప్రతిసారి ఈ పెన్నే సాయం చేస్తుండాలి. బలం ఉన్నోడికి చేతులెత్తి మొక్కాలి కానీ రాళ్లు విసరకూడదు. సమస్యల మీద బతికే జర్నలిస్టులు సమస్యలెలా తీరుస్తారు. వార్త రాస్తే వచ్చేది 200. అదే దుడ్డు తీసుకుంటే 2000 వస్తుంది. లాంటి డైలాగ్స్ ఈ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఎపిసోడ్ వైడ్ గా వెళ్లిన ఈ వెబ్ సిరీస్ కాస్త లాగింగ్ గా అనిపించినా జనాల్లో ఆలోచనలు రేకెత్తించేలా ఉందని చెప్పుకోవచ్చు.