»Nizamabad Govt Hospital Superintendent Given Explanation On Patient Incident
రోగిని లాక్కెళ్లిన సంఘటనకు ప్రభుత్వానికి సంబంధం లేదు: Superintendent
తల్లిదండ్రుల పొరపాటు వలన ఆ సంఘటన జరిగింది. ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వం తప్పిదం ఎక్కడా లేదు అంటూ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సంఘటనపై సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు.
‘తెలియకుండా ఓ వ్యక్తి వీడియో తీశాడు.. కానీ ఆ రోగికి సరైన వైద్యం అందించాం.. ఆ సంఘటనకు ప్రభుత్వానికి, ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదు’ అంటూ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి (Nizamabad Govt Hospital) సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. లిఫ్ట్ వచ్చేలోపు ఆ సంఘటన జరిగిందని వివరణ ఇచ్చారు. తల్లిదండ్రులు తొందరపడి అలా చేశారని.. దానికి తమకు సంబంధం లేదని వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని కాళ్లతో ఈడ్చుకుంటూ లాక్కెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ (Congress), వైఎస్సార్ టీపీ, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా ఈ సంఘటనపై మంత్రి హరీశ్ రావు (Harish Rao) విచారణకు ఆదేశించారు. అయితే ఆ సంఘటన తల్లిదండ్రుల తొందరపాటు వలనే జరిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ (Superintendent) ప్రతిమా రాజ్ (Prathima Raj) వివరణ ఇచ్చారు.
‘ఈ సంఘటన మార్చి 31వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. రోగిని వైద్య పరీక్షల కోసం రెండో అంతస్తుకు తీసుకెళ్లాల్సి ఉంది. పేషెంట్ కేర్ సిబ్బంది వీల్ చైర్ తీసుకొచ్చే లోపే లిఫ్ట్ వచ్చింది. వీల్ చైర్ (Wheel Chair) తెచ్చే వరకు ఆగకుండా లిఫ్ట్ వచ్చిందని వారి తల్లిదండ్రులు అతడిని లాగుతూ తీసుకెళ్లారు. ఇది గమనించిన మా సిబ్బంది వారించారు. తర్వాత రెండో అంతస్తులో ఆ రోగికి పూర్తి వసతులతో వైద్యుడికి చూపించాం. ఇది తెలియని ఓ వ్యక్తి వీడియో (Patient Dragged Video) తీసి వైరల్ చేశారు. ఈ సంఘటనకు, ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధం లేదు’ అని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ స్పష్టం చేశారు.