»Death Threat To Ys Sharmila And Ys Vijayamma Says Dl Ravindra Reddy Sensational Comments
విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్ సీపీలో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.
వైఎస్సార్ కుటుంబంలో మరో ముప్పు పొంచి ఉందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి (DL Ravindra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ (YS Jagan) బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మాదిరి మరో రెండు సంఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ విజయమ్మ (YS Vijayamma), షర్మిల (YS Sharmila) ప్రాణాలకు ముప్పు ఉందని.. వారు హత్యకు గురవుతారనే వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో (Interview) పాల్గొన్న డీఎల్ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు.
ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తాడు. గతంలో కోడికత్తి డ్రామా (Kodi Kathi), వివేక హత్య అందులో భాగమేనన్నారు. ఈసారి ఎవరి గొంతు కోయాలా అనే ఆలోచన చేస్తు ఉంటాడని తెలిపారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) గతంలో ఇచ్చిన ఆలోచనలు పని చేయడంతో ఈసారి మళ్లీ అలాంటి ఆలోచనలు చేసే ప్రమాదం ఉంది. పీకే సూచన మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు విజయమ్మ, షర్మిల హత్య జరిగే ప్రమాదం ఉందని చెప్పి సంచలనం రేపారు. వాళ్లిద్దరూ జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నా. జగన్ సన్నిహితులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, విశాఖపట్టణంలో కోడి కత్తి దాడి డ్రామాలు జరిగాయని వెల్లడించారు.
‘రాజారెడ్డి రాజ్యాంగం లేదు. వైఎస్సార్ రాజ్యాంగం లేదు. ఇప్పుడు భారతీ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. దాని ప్రకారమే ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. తప్పు చేసిన వాడు శిక్షింపబడుతాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వారిని వదలిపెట్టదు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే జగన్ వంటి రాక్షస రాజ్యాంగంలో ఎవరూ మిగిలిపోయే వారు కాదు. హైదరాబాద్ లో ఉంటున్న విజయమ్మ, షర్మిల నివాసంలో భద్రతా సిబ్బంది సీఎం జగన్ కు నివేదికలు ఇస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి’ అంటూ డీఎల్ రవీంద్రా రెడ్డి సలహా ఇచ్చారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్ సీపీలో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏ పార్టీకి మద్దతు తెలపని వ్యక్తి సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తాజాగా కుటుంబపరమైన విమర్శలు చేయడంతో ఏపీలో సంచలనం రేపాయి. దీనిపై ఇంకా వైఎస్సార్ సీపీ నాయకులు స్పందించలేదు.