»Nirmal District Mother Of The Bride Who Had Child Marriage To The Married Man By Taking 25 Thousand
Child marriage: మనీ కోసం కుమార్తెకు బాల్య వివాహం చేసిన తల్లి
14 ఏళ్ల కుమార్తెను కేవలం 25 వేల రూపాయలకే కన్న తల్లి అమ్మెసింది. ఆ క్రమంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఓ వ్యక్తితో పెళ్లి చేస్తుండగా..ఆ యువతి స్థానిక నేతలకు చెప్పి..ఎలాగోలా బయటపడింది. అంతేకాదు వరుడికి ఇది రెండో వివాహం కావడం విశేషం.
Nirmal district, mother of the bride who had child marriage to the married man by taking 25 thousand
Child marriage: సమాజం ముందుకు వెళ్తుందా లేదా వెనక్కి వెళ్తుందా అన్న అనుమానాలు వస్తాయి కొన్ని సంఘటనలు చూసినప్పుడు. ఇంకా బలవంతపు బాల్య వివాహాలు(Child marriages) ఉన్నాయి అంటే నమ్మరేమో కాని, ఓ కసాయి మామ, కన్న తల్లి చేసిన ఘన కార్యానికి కేవలం 14 ఏళ్లకే నూరేళ్ల శిక్ష అనుభవించాల్సి వచ్చేది ఓ మైనర్ బాలిక(minor girl). కానీ అమ్మాయి తెగువతో ఆ సంకేళ్ల నుంచి విముక్తి లభించింది. నిర్మల్ జిల్లా(Nirmal District)లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలవరం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన దంపతుల 14 సంవత్సరాల అమ్మాయికి నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దాసరి నగేష్ (33)తో 10 రోజుల క్రితం బలవంతంగా నిశ్చితార్థం జరిపించారు. కుటుంబ పెద్దల సమక్షంలో ఆదివారం వరుడి స్వగ్రామంలో పెళ్లి జరిగింది. వివాహానంతర కార్యక్రమాల్లో భాగంగా అదేరోజు రాత్రి కొత్త జంట సహా ఇరువైపులా కుటుంబ సభ్యులు వధువు (ఓలా) గ్రామానికి వచ్చారు.
సోమవారం ఉదయం విందులో భాగంగా భర్త సహా బంధువులు, కుటుంబీకులు అందరూ మద్యం తాగేందుకు బయటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన బాలిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సర్పంచి ఫాతిమాను కలిసింది. తనకు పెళ్లి ఇష్టం లేదని బలవంతంగా చేస్తున్నారని ఏడ్చింది. తన తల్లి, మేనమామ పెళ్లికొడుకు కుటుంబ సభ్యుల వద్ద రూ.25 వేలు తీసుకుని కొట్టి ఒప్పించారని అసలు నిజం చెప్పింది. దీంతో సర్పంచి స్థానిక పోలీసులకు, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ లక్ష్మీ విశారదకు సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని బాలిక సహా ఇరువైపులా కుటుంబ సభ్యులను విచారించారు.
పెళ్లి కూతురు వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిగా బాలిక వయస్సు బయటపడింది. యువకుడికి గత జులై నెలలోనే ఒక పెళ్లి జరిగినట్టు తెలుసుకొని షాక్ అయ్యారు. సంతానం కలగదని అతను మొదటి భార్యతో తెగదెంపులు చేసుకున్నాడని నిజం బయటపడింది. తనతో విడాకులు తీసుకున్న నెల రోజుల వ్యవధిలోనే రెండో పెళ్లికి సిద్ధం అయి ఈ బాలికను వివాహం చేసుకున్నాడని విచారణతో తేలింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం అని పోలీసులు తెలిపారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులు బాలికను నిర్మల్ సఖీ కేంద్రంలో జాయిన్ చేశారు.