»Burning Effigy Of Minister Talasani Demand To Apologize
Nirmal : మంత్రి తలసాని దిష్టిబొమ్మకు శవయాత్ర.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఖరికి వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలు నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన రాజేశ్ బాబును అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ (Telangana) ఉద్యమకారుడు అయిన రాజేశ్ బాబు (Rajesh Babu)ను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అవమానించారని నిర్మల్ జిల్లా (Nirmal District) వ్యాప్తంగా గిరిజన సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు నిరసనకు దిగారు. మంత్రి తలసాని దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దహనాలు చేపట్టారు. రాజేశ్ బాబుకు మద్దతుగా నినదాలు వినిపించారు. తలసాని క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
హైదరాబాద్(Hyderabad)లో శనివారం స్టీల్ బ్రిడ్జి (Steal Bridge) ప్రారంభోత్సవం జరగ్గా మంత్రి కేటీఆర్ (Minister KTR) పక్కన ఉన్న భైంసా ఏఎంసీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జాదవ్ రాజేశ్ బాబును మంత్రి తలసాని తీవ్రంగా అవమానించారని, ఆయన చర్యను ఖండిస్తున్నట్లు నిర్మల్ ప్రజలు తెలిపారు. తలసాని దిష్టబొమ్మకు లోకేశ్వరం మండలం రాజేశ్ తండా, పుస్పూరుతో పాటు పలు గ్రామాల్లో శవయాత్రను చేపట్టారు. పాడెకట్టి డప్పు భాజాలతో గ్రామంలో దిష్టిబొమ్మను ఊరేగించారు.
నిర్మల్ (Nirmal), భైంసా, ముధోల్, ఖానాపూర్ గ్రామాలతో పాటుగా మరికొన్ని గ్రామాల్లో గిరిజన సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలిపారు. తలసానిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజేశ్ బాబును పక్కకు నెట్టేసి తలసాని చెంపదెబ్బ కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తలసానిని హైదరాబాద్ నుంచి ఖాళీ చేయిస్తామని, ఉద్యమ ద్రోహులను మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజేశ్ బాబుకు వెంటనే తలసాని క్షమాపణలు చెప్పాలని లంబాడీ సంఘం డిమాండ్ చేసింది. గిరిజన సంఘానికి తలసాని వెంటనే క్షమాపణలు చెప్పి తీరాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.