»New Type Of Fever In Ap First Case Registered In Kuppam
Fever: ఏపీలో కొత్త రకం జ్వరం.. కుప్పంలో మొదటి కేసు నమోదు
ఏపీలో కొత్తరకం జ్వరాన్ని వైద్యులు గుర్తించారు. స్క్రబ్ టైపర్ అనే ఆ జ్వరం శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతుందని, జ్వరం వచ్చిన వారు కచ్చితంగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.
వర్షాకాలంలో(Rainy season) వైరల్ జ్వరాలు రావడం మామూలే. అయితే ఇప్పుడు డెంగ్యూ, మలేరియా మాదిరిగానే ఏపీలో ఓ కొత్తరకం జ్వరం వ్యాప్తిచెందుతోంది. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో మొదటి కేసు నమోదైంది. ఈ విషయాన్ని పీఈఎస్ వైద్య కళాశాల డీన్, ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్ఆర్ కృష్ణరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రమణ్య వెల్లడించారు. స్క్ర బ్ టైపస్ (Scrub Typhus) అనే కొత్త రకం జ్వరంగా దీనిని గుర్తించినట్లు తెలిపారు.
ఈ జ్వరం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఇది చాలా అరుదుగా సంభవించినా చాలా కాలం పాటు వస్తే వివిధ అవయవాలు పాడవతాయని తెలిపారు. అంతేకాకుండా రోగి మరణించడానికి కూడా దారి తీసే అవకాశం ఉందని పీఈఎస్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్ర బ్ టైపస్ (Scrub Typhus) అనేది విష జ్వరమని, ఒక క్రిమి కాటు వల్లన ఇది వస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు. పొలాల్లో, ఉతకని బట్టల్లో, శుభ్రం చేయని బట్టల బీరువాల్లో ఆ క్రిములు ఎక్కువగా ఉంటాయన్నారు.
ఈ కొత్త రకం జ్వరం బారిన పిల్లలు, వృద్ధులే అధికంగా పడతారని వైద్యులు హెచ్చరించారు. స్క్ర బ్ టైపస్ (Scrub Typhus) జ్వరం వస్తే తలనొప్పి తీవ్రంగా ఉంటుందని, శరీరంపైన దద్దుర్లు ఏర్పడతాయని, నల్లటి మచ్చలు కూడా వస్తాయని తెలిపారు. కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలను ఈ జ్వరం దెబ్బతీస్తుందన్నారు.
స్క్ర బ్ టైపస్ (Scrub Typhus) జ్వరం వచ్చిన వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వదిలిన బట్టలను ఎప్పటికప్పుడు ఉతికి ఆరబెట్టుకోవాలని తెలిపారు. తరచూ స్నానం చేయాలని, శరీరంపై నల్లటి మచ్చలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు వెల్లడించారు.