నటసామ్రాట్ గా తెలుగు జాతి అభిమానం పొందిన విలక్షణ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావుపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించాడు. ఎవరినీ కించపరిచేలా తాను మాట్లాడలేదని స్పష్టత ఇచ్చాడు. అదంతా ప్రేమ, అభిమానంతో చేసిన వ్యాఖ్యలేనని తెలిపాడు. నాగేశ్వర్ రావు అంటే తనకు ఎంతో అభిమానమని, సొంతపిల్లల మాదిరి చూసుకున్నాడని పేర్కొన్నాడు. పైగా ఏఎన్నార్ తనకు బాబాయ్ లాంటి వ్యక్తి అని, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు వివరణ ఇచ్చాడు.
వీరసింహారెడ్డి విజయోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ ఏఎన్నార్, ఎస్వీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ తాతపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం తారస్థాయికి చేరుకోవడంతో బాలకృష్ణ స్పందించాడు. హిందూపురంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయనను మీడియా తొక్కినేని వ్యాఖ్యలపై ప్రశ్నించింది.
స్పందించిన బాలకృష్ణ.. ‘అక్కినేనిని కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఒక్కొక్క ప్రాంతం.. ఒక్కొక్క యాసలో ఒక్కోలా మాట్లాడతారు. ఎన్టీఆర్ ను ఎన్టీవోడు అంటారు.. నాగేశ్వర్ రావు నాగిగాడు అంటారు. ప్రేమ, అభిమానంతో అలా అన్నాను.. అంటారు. నాగేశ్వర్ రావు నాకు బాబాయ్. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా నన్ను చూసుకునేవాడు. అక్కడ ఆప్యాయత లేదు.. ఇక్కడ ఉంది. ఏఎన్నార్ మహానటుడు. ఇండస్ట్రీకి ఇద్దరే కళ్లు. ఒకరు నాన్నగారు, ఇంకొకరు ఏఎన్నార్. నాన్నగారి నుంచి క్రమశిక్షణ.. బాబాయ్ నాగేశ్వర్ రావు నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం నేర్చుకున్నా. రామారావు పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి జాతీయ అవార్డును ఏఎన్నార్ కే ఇచ్చాం’ అని బాలకృష్ణ అన్నారు.
కాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై దివంగత నటుడు ఎస్వీ రంగారావు కుటుంబసభ్యులు సైతం స్పందించారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సర్వసాధారణమైనవని, వాటితో తమకు ఎలాంటి వివాదం లేదని కొట్టిపారేసారు. దీనిపై వివాదం కొనసాగించవద్దని హితవు పలికారు. అక్కినేని అభిమానులు మినహా మిగతా ప్రజలంతా బాలకృష్ణ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే స్వతహాగా బాలకృష్ణ మనస్తత్వం ఎరుగిన వారెవరూ దీన్ని వివాదంగా చూడటం లేదు. కొందరు ట్రెండింగ్ కోసం ఈ వ్యాఖ్యలపై రచ్చ చేస్తున్నారని బాలకృష్ణ అభిమానులు చెప్తున్నారు. ఒకరిని కించపరచాలనే మనస్తత్వం బాలకృష్ణది కాదు. తాజాగా బాలయ్య స్పందనతో ఈ వివాదం సద్దుమణిగినట్టే అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.