తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. అందేంటీ అనుకుంటున్నారా. అవును రెండు రాష్ట్రాల్లోని 15 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేదుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 9 స్థానాలతోపాటు ఖాళీ కానున్న 6 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్(MLC elections Schedule 2023) ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న రెండు తెలుగు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్(ap)లో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. వాటిలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, ఎనిమిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. ప్రకాశం-నెల్లూరు పట్టభద్రుల స్థానంతోపాటు కడప-అనంతపురం-కర్నూల్ నియోజకవర్గం, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల స్థానాలు ఉన్నాయి.
ఇక ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ స్థానంతోపాటు కడప-అనంతపురం-కర్నూల్ ఉపాధ్యాయ నియోజకవర్గం కూడా ఉంది. ఇటు అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, కర్నూల్ జిల్లాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 16న విడుదల కానుండగా..మార్చి 13 పోలింగ్ నిర్వహించిన, 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 23వ తేదీ గడువుగా కాగా, ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 27న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొన్నారు.
అటు తెలంగాణ(Telangana)లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్(elections Schedule) రిలీజైంది. వాటిలో ఒకటి ఉపాధ్యాయ, ఇంకొటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం, హైదారాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న పోలింగ్ జరగనుండగా..మార్చి 16న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు వివరాలను వెల్లడించింది.