తమ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ (Bandi Sanjay Arrest) అంశం పైన తాము న్యాయపరంగా పోరాడుతామని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన రావు (Dubbak MLA Raghunandan Rao) అన్నారు. ఈ సందర్భంగా రఘునందన రావు ప్రశ్నల వర్షం కురిపించారు. సంజయ్ ఫోన్ కి జర్నలిస్ట్ ప్రశాంత్ పేపర్ ఎప్పుడు పంపించారని, శివగణేష్ ఎవరెవరికి ఆ పేపర్ పంపించాడని, మీరు విచారణ జరిపించారా.. శివగణేష్ వాట్సాప్ చెక్ చేశారా, సీజ్ చేసి కోర్టుకు సమర్పించారా, ఆ పేపర్ బయటకు వచ్చిన రెండు గంటల తర్వాత బండి సంజయ్ కు వచ్చిందని, అంతకంటే ముందే మీడియా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు, ఇతర ఏఏ ఛానల్స్ కు వెళ్లిందో చెప్పాలన్నారు. 4వ తేదీ అలాగే, 5వ తేదీ ప్రెస్ మీట్ కు చాలా తేడా కనిపిస్తోందని, ప్రభుత్వం పెద్దలు వారి నోట ఓ కథ చెప్పించారన్నారు.
మీడియా ప్రతినిధి.. పోలీసులు, రాజకీయ నాయకులకు సమాచారం ఇస్తే కుట్ర అంటున్నారని, మీకు మీడియా ప్రతినిధుల నుంచి సమాచారం రాదా అని నిలదీశారు. వంద శాతం బీజేపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా కత్తితో పొడిచిన వ్యక్తి మొదటి ముద్దాయి అవుతాడని, కానీ చంపిన వ్యక్తిని అక్కడి నుండి తీసుకు వెళ్లిన వారిని మొదటి ముద్దాయి అనడం విడ్డూరంగా ఉందన్నారు. శివగణేష్ ఫోన్ నుండి మొదట ఎవరెవరికి వెళ్లిందో వరంగల్ సీపీ చెప్పాలన్నారు. ఒక పార్టీ పట్ల కక్ష సాధింపుతో వ్యవహారించడం పోలీసులకు సరికాదన్నారు. ఎవరిదైనా వ్యక్తి గత సమాచారం కోసం టెలిగ్రాఫ్ చట్టం(Telegraph Act) సెక్షన్ 92పై పోలీసులకు అవగాహన ఉండాలన్నారు.
ఒకరి వ్యక్తిగత డేటా ఇచ్చేందుకు జిల్లా న్యాయమూర్తి మాత్రమే ఆదేశిస్తారని, కమిషనర్ అడిగారని సర్వీస్ ప్రొవైడర్లు కూడా వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని చెప్పారు. పోలీసులు ఎవరి ఫోటోలు ఎలా పడితే అలా తీయడం సరికాదని చెప్పారు. అలాగే, తాను ఎవరినో కించపరిచినట్లు మాట్లాడుతున్నారని, తాను ఎవరినీ కించపరిచి మాట్లాడలేదని చెప్పారు. ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే తాను ఆ మాటలు వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని, కానీ తాను ఎప్పుడూ అలా మాట్లాడలేదన్నారు. అలాగే, వరంగల్ పోలీసులు లోకసభ స్పీకర్ కార్యాలయంను(Lok Sabha Speaker’s Office) తప్పుదోవ పట్టిస్తే లోకసభ సభ్యుడుగా ప్రివిలేజ్(Privilege) ఉంటుందని, సంజయ్ బయటకు వచ్చాక ప్రివిలేజ్కు అనుగుణంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు.
కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి నుండి దృష్టి మళ్లించేందుకే.. డీకే అరుణ
బీజేపీపై కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. కేసీఆర్ కుటుంబం పైన వస్తున్న అవినీతి ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. తనంతట తానుగా ఫోన్లు ఇవ్వలేదని, ఈడీ అడిగితేనే ఎమ్మెల్సీ కవిత ఇచ్చారని గుర్తు చేశారు. సంజయ్ ఫోన్ విషయంలో పోలీసులు అబద్దాలు చెబుతున్నారన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పైన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు.