»Minister Kt Rama Rao Shares Her Personnel Things On Womens Day
KTR మహిళా దినోత్సవం వేళ ఆసక్తికర విషయాలు పంచుకున్న కేటీఆర్
వీ హబ్ కు రూ.1.30 కోట్లు ఇస్తే ఓ స్టార్టప్ తో దాన్ని రూ.70 కోట్లకు పెంచారు. మహిళలు బాధ్యతాయుతంగా ఉంటూ నిబద్ధతతో ముందుకువెళ్లాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణలో సింగిల్ విండో విధానం అమలు చేయబోతున్నాం’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ (International Women’s Day) కార్యక్రమాలు సందడిగా జరుగుతున్నాయి. మహిళల హక్కులు, సాధికారత వంటి అంశాలపై ప్రదర్శనలు, సదస్సులు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా ప్రత్యేక కానుకలు అందించింది. స్వయం సహాయక మహిళలకు రూ.750 కోట్ల రుణాలు విడుదల చేసింది. దీంతోపాటు మార్చి 8న సాధారణ సెలవుగా ప్రకటించింది. ఆరోగ్య మహిళ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించి మహిళలకు ప్రత్యేక వైద్య సదుపాయం కార్యక్రమాన్ని ప్రారంభించింది. కరీంనగర్ లో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (T Harish Rao) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలోనే వీ హబ్ (We Hub) హైదరాబాద్ (Hyderabad)లోని తాజ్ కృష్ణా హోటల్ (Taj Krishna Hotel)లో నిర్వహించి మహిళల దినోత్సవం కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KT Rama Rao) పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘మా తల్లిదండ్రులు నన్ను, నా చెల్లి (కవిత)ను బాగా చదివించారు. నువ్వు ఎక్కువ.. తక్కువ అనేది వారు ఎప్పుడూ చూపించలేదు. నా చెల్లి యూఎస్ వెళ్తా అంటే నాకంటే ముందే పంపారు. మేం కూడా మా పిల్లలను సమానంగా ట్రీట్ చేస్తున్నాం. ఏం కావాలనుకుంటే ఆ దిశగా ముందుకు వెళ్లాలని ప్రోత్సహిస్తున్నాం. కిందపడితే మేం ఉంటామనే ధైర్యాన్ని ఇస్తున్నాం. పిల్లలకు ఆ నమ్మకం కల్పిస్తే అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా వంద శాతం అభివృద్ధి సాధిస్తారు’ అని కేటీఆర్ తెలిపాడు.
‘అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలి. అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే మెలకువలు నేర్పించాలి. ఈ విషయంలో మన ఆలోచనా పద్ధతిలో మార్పు రావాలి. తెలుసో తెలియకో అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ అనే భావన ఇంటి నుంచే నేర్పిస్తాం. పిల్లలను ఎలా పెంచుతాం అనేది ముఖ్యం’ అని కేటీఆర్ పేర్కొన్నాడు. అనంతరం వీ హబ్ ప్రస్థానంపై మాట్లాడుతూ.. ‘వీ హబ్ 5వ వార్షికోత్సవం చేసుకోవడం ఆనందంగా ఉంది. వీ హబ్ కు రూ.1.30 కోట్లు ఇస్తే ఓ స్టార్టప్ తో దాన్ని రూ.70 కోట్లకు పెంచారు. మహిళలు బాధ్యతాయుతంగా ఉంటూ నిబద్ధతతో ముందుకువెళ్లాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణలో సింగిల్ విండో విధానం అమలు చేయబోతున్నాం’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.