ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని, మరో మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వాతావరణ శాఖ (Weather Department) తాజా బుల్లెటిన్ విడుదల చేసింది. అల్పపీడనం బలపడిందని, దాని వల్ల ఏర్పడిన వాయుగుండం పాండిచ్చేరికి 790 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 970 కిలోమీటర్ల దూరంలో ఉందని, రేపటికి ఆ వాయుగుండం మరింత బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 3వ తేదికి నైరుతి బంగాళాఖాతంలో తుఫాను (Cyclone) అలజడి సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Cyclone 'Miachaung' likely to hit Tamil Nadu, coastal Andhra Pradesh on December 4 – https://t.co/C8JT2togtc 'Miachaung' likely to hit Tamil Nadu, coastal Andhra Pradesh on December 4 pic.twitter.com/cjhebQp1YE
ఈ తుఫానుకు మిచౌంగ్గా మయన్మార్ దేశం నామకరం చేసింది. డిసెంబర్ నాలుగో తేదికి చెన్నై, నెల్లూరు సమీపానికి తుఫాను చేరి ఆ తర్వాత 5వ తేదికి గుంటూరు తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిచౌంగ్ తుఫాను (Miachaung Cyclone) ప్రభావం ఏపీలోనే ఎక్కువగా ఉంటుందని, ప్రధానంగా కోస్తాపై దాని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్ష సూచన మేరకు పిల్లలు, వృద్ధులు ఇళ్లల్లోనే ఉంటే మంచిదని వాతావరణ శాఖ సూచించింది. భారీ ఈదురుగాలులకు చాలా ప్రాంతాలు దెబ్బతినే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అలాగే 5వ తేదీన మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆది, సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని, ముఖ్యంగా దక్షిణ కోస్తాలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంతగా వర్షాలు కురవకపోయినా ఈ తుఫాను ప్రభావంతో రైతులకు మరింత ప్రయోజనం కలగనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదైమైనప్పటికీ మిచౌంగ్ తుఫాన్ (Miachaung Cyclone) ఎఫెక్ట్ ఏపీపై ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.