»Manik Kadam Appointed As Brs Party Maharashtra Kisan Cell President
BRS Party మహారాష్ట్రలో కేసీఆర్ దూకుడు.. మరో కీలక నిర్ణయం
మహారాష్ట్రలో రైతుల తరఫున మాణిక్ కదమ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో సంభవిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు ముందుగా కిసాన్ సెల్ పైనే కేసీఆర్ దృష్టి సారించారు.
బీఆర్ఎస్ (BRS Party) పేరిట జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే ఖమ్మం సభను విజయవంతంగా నిర్వహించి జాతీయవ్యాప్తంగా చర్చ లేపారు. ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం (New Secretariat) ప్రారంభోత్సవం, పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభతో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించాలని భావించగా కుదరలేదు. ప్రస్తుతం కేసీఆర్ (KCR) దృష్టి త్వరలో ఎన్నికలు జరగబోయే కర్ణాటకతో పాటు మహారాష్ట్రపై ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్ లో సభ నిర్వహించి సంచలనం రేపారు. తాజాగా మహారాష్ట్ర విషయమై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్ర కిసాన్ సెల్ (Kisan Cell President) అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ (Manik Kadam)ను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటన వెలువరించారు. జాతీయ స్థాయిలో కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చడూనీ ఉన్న విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్రలో రైతుల తరఫున మాణిక్ కదమ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో సంభవిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు ముందుగా కిసాన్ సెల్ పైనే కేసీఆర్ దృష్టి సారించారు. రైతులను తన వైపునకు తిప్పుకున్న అనంతరం మిగతా పార్టీ కమిటీని మహారాష్ట్రకు నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కాగా ఇటీవల సీఎం కేసీఆర్ కుమార్తె, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ (Chatrapati Sivaji) విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం జాతీయ మీడియా నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ (Modi)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.