ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు రావాలని పిలుపునిచ్చారు. తాము కూడా ముందస్తు ఎన్నికలకు వస్తామని ప్రకటించారు. ఎవరు ఏమిటో ప్రజల వద్ద తేల్చుకుందామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పర్యటించిన కేటీఆర్ ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
‘కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు. పన్నుల రూపంలో మనం కట్టిన డబ్బులను బీజేపీ పాలక రాష్ట్రాల్లో వాడుకుంటున్నారు. నేను చెప్పింది తప్పు అయితే రాజీనామాకు సిద్ధం. మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించాం. తెలంగాణలోని రైతుల్లో ఆశలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. 24 గంటల విద్యుత్ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరి కేంద్రం ఏం చేస్తోంది. 65 ఏళ్లల్లో చేసిన అప్పుల కన్నా అధికంగా వంద లక్షల కోట్ల అప్పులు ప్రధాని మోదీ చేశారు. స్థానికంగా ఉన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మాటలు జాగ్రతగా, సంస్కారవంతంగా మాట్లాడాలి. ఆయన కన్నా ఎక్కువ మాటలైనా.. బూతులైనా మాకు ఎక్కువ వస్తాయి. కానీ మాకు సంస్కారం ఉంది. అరవింద్ కు దమ్ముంటే, చేతనైతే తెలంగాణకు రావాల్సిన హక్కులను కేంద్రం వద్ద సాధించుకుని రా. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ముందస్తుకు రండి. తప్పకుండా ముందస్తుకు అందరం కలిసి పోదాం. ఎవరు ఏమిటో ప్రజలే తేలుస్తారు’ అని కేటీఆర్ తెలిపారు.
‘పెద్దాయన డి.శ్రీనివాస్ అంటే మా అందరికీ గౌరవం ఉంది. పెద్ద మనిషి కొడుకవని ఊకుంటున్నాం. సంస్కారహీనంగా మాట్లాడకు’ అని బీజేపీ ఎంపీ అరవింద్ కు మంత్రి కేటీఆర్ హితవు పలికారు. ఇక నిజామాబాద్ లో నెల రోజుల్లో ఐటీ హబ్, న్యాక్ భవనాన్ని ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.936 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.