మహిళలపై నేరాలను అరికట్టడంలో న్యాయస్థానాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అబలలకు అండగా కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు ఉండడంతో కొద్దోగొప్పో మహిళలపై అఘాయిత్యాలు అదుపులో ఉన్నాయి. తాజాగా కేరళ ఉన్నత న్యాయస్థానం సంచలన ప్రకటన చేసింది. పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్ మాదిరి నో మీన్స్ నో (వద్దంటే వద్దు) అని కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మహిళ లేదా బాలిక వద్దంటే వద్దు అనే అర్థమని, దీన్ని పురుషులు తెలుసుకోవాలని హితవు పలికింది.
ఓ కేసు విషయంలో శనివారం కేరళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సమయంలో మహిళలపై నేరాల విషయంలో జస్టిస్ దేవన్ రామచంద్రన్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళ లేదా బాలికను అనుమతి లేకుండా తాకకూడదని స్పష్టం చేశారు. ఈ పాఠాలను పాఠశాల స్థాయిలోనే బాలురకు నేర్పాలని సూచించారు. సత్ప్రవర్తన, మర్యాదలకు సంబంధించిన అంశాలను ప్రాథమిక స్థాయిలోనే పాఠ్యాంశాల్లో భాగం చేయాలని హైకోర్టు పేర్కొంది. లైంగిక వేధింపుల కేసుల పెరుగుతుండడంపై ఈ సందర్భంగా న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.