»Karnataka Minister Ashwath Narayan Key Comments On Siddaramaiah
Karnataka మాజీ ముఖ్యమంత్రిని చంపేయండి.. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ప్రజల సమస్యలు వదిలేసి మతం, టిప్పు సుల్తాన్ అంశాన్ని పైకి తెస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే కుట్రను కాంగ్రెస్ భగ్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో కూడా బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండడంతో బీజేపీ ఈ పాత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
అడ్డదారిన గద్దెనెక్కిన బీజేపీ కర్ణాటక (Karnataka)లో ఆగడాలు సృష్టిస్తోంది. ఇప్పటికే కమీషన్ల (Commission Government) ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతుండగా.. మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారం మరింత దారుణంగా మారుతోంది. వీధి రౌడీల్లా మారుతున్నారు. తాజాగా ఓ మంత్రి ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని చంపేయాలని బహిరంగంగా పిలుపునిచ్చాడు. వాళ్లను చంపినట్టు మాజీ సీఎమ్ ను హత్య చేయాలని బీజేపీ (BJP) కార్యకర్తలకు పిలుపునివ్వడం కలకలం రేపింది. ఒక బాధ్యాతయుత పదవిలో ఉండీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కర్ణాటకలో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) రానున్నాయి. అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. విద్వేషాలు రెచ్చగొట్టి దాని ద్వారా ఓట్లు దండుకోవాలనే కుట్రను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక మంత్రి అశ్వథ నారాయణ (Ashwath Narayan) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) సిద్ధరామయ్య (Siddaramaiah)పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం మాండ్య జిల్లాలో జరిగిన ఓ సభలో అశ్వథ నారాయణ మాట్లాడుతూ.. ‘మీకు టిప్పు సుల్తాన్ కావాలా? హిందూత్వ సిద్ధాంత కర్త సావర్కర్ కావాలా? టిప్పు సుల్తాన్ ను హతమార్చినట్టు సిద్ధరామయ్యను హత్య చేయాలి. నాడు టిప్పు సుల్తాన్ ను హురి గౌడ, నంజే గౌడ ఏ విధంగా హత్య చేశారో అదే మాదిరి సిద్ధరామయ్యను చేయాలి. టిప్పు సుల్తాన్ అనుచరులు భూమి మీద మిగలకూడదు’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపడంతో అశ్వథ నారాయణ స్పందించారు. ‘సిద్ధరామయ్యను టిప్పు సుల్తాన్ తో పోల్చిన విషయం వాస్తవమే. టిప్పు సుల్తాన్ పై ఆయనకు ఉన్న ప్రేమతోనే అలా మాట్లాడా. వచ్చే ఎన్నికల్లో అతడిని ఓడించాలని చెప్పడమే తన ఉద్దేశం. అంతే కానీ భౌతికంగా సిద్ధరామయ్యపై దాడి చేయాలని నేను చెప్పలేదు’ వివరణ ఇచ్చాడు.
అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఒక బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హితవు పలికారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ సందర్భంగా మంత్రిపై వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘ప్రజలను తప్పుదోవ పట్టించి నన్ను చంపేందుకు మంత్రి ప్రోత్సహిస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడం ఎందుకు? నువ్వే ఒక తుపాకీ పట్టుకుని నన్ను కాల్చేయ్’ అని సవాల్ విసిరారు. ‘బీజేపీ గుజరాత్ సంస్కృతిని కర్ణాటకలో కూడా ఆచరిస్తోంది. గుజరాత్ లా కర్ణాటకను మారుస్తామంటే కన్నడ ప్రజలు చూస్తూ ఊరుకోరు’ అని సిద్ధరామయ్య తెలిపారు.
కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలు టిప్పు సుల్తాన్ కేంద్రంగా జరిగేలా బీజేపీ ప్రణాళిక వేస్తోంది. ఇటీవల తరచూ బీజేపీ నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రజల సమస్యలు వదిలేసి మతం, టిప్పు సుల్తాన్ అంశాన్ని పైకి తెస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే కుట్రను కాంగ్రెస్ భగ్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో కూడా బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండడంతో బీజేపీ ఈ పాత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.