»Karnataka Assembly Elections Independent Candidate From Yadgir Pays Rs 10000 Deposit Money In Coins Collected From Voters
Karnataka Assembly Elections: రూ.10,000 చిల్లర డిపాజిట్ చేసి, నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి
కర్నాటకలోని యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ వ్యక్తి డిపాజిట్ చేయాల్సిన రూ.10,000 మొత్తాన్ని నాణేల రూపంలో తెచ్చి, నామినేషన్ దాఖలు చేసిన ఘటన చోటు చేసుకున్నది. యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం (Yadgir Assembly Constituency) నుండి యంకప్ప అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు డిపాజిట్ మొత్తాన్ని డిజిటల్ రూపంలోను (digital deposit) చెల్లించే అవకాశం ఉంది. కానీ యంకప్ప మాత్రం మొత్తం నాణేలు తెచ్చి, ఎన్నికల అధికారుల ముందు కుప్ప పోసారు. అధికారులు వాటిని లెక్కించి, నామినేషన్ తీసుకున్నారు. యంకప్ప కూడా ఈ మొత్తాన్ని తన నియోజకవర్గంలోని పలువురి నుండి సేకరించారు. మే 10వ తేదీన కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు సొంత గ్రామస్తులతో పాటు నియోజకవర్గంలోని వారి నుండి డబ్బులు కలెక్ట్ చేశారు.
యంకప్ప మంగళవారం యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతో పాటు రూపాయి నాణేలను ఎన్నికల అధికారుల బల్లపై పెట్టడంతో, అధికారులు వాటిని లెక్కించడానికి దాదాపు రెండు గంటల సమయం తీసుకున్నది. నామినేషన్ దాఖలు చేయడం కోసం ఆయన తన మెడలో స్వామి వివేకానంద, 12వ శతాబ్దంనాటి సాంఘిక సంస్కర్త బసవేశ్వర, కర్ణాటకకు చెందిన సాధువు, కవి కనకదాస, బీఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ ప్రవేశిక చిత్రాలతో కూడిన బ్యానర్‌ను ధరించారు. ఈ చిత్రాల క్రింద కన్నడంలో ఓ హామీని రాశారు. కేవలం ఓ రూపాయి మాత్రమే కాదు, ఒకరోజు నాకు ఓటు వేయండి, నేను మీకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తాను అని రాశారు.
యంకప్ప మీడియాతో మాట్లాడారు. తాను తన కమ్యూనిటీ ప్రజలకు, గ్రామానికి, నియోజకవర్గానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నానని, తాను రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు స్వామి వివేకానంద సూక్తి రాసిన చిత్రంతో వచ్చానని చెప్పారు. తాను ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేస్తానన్నారు. తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసి, ప్రజల నుంచి విరాళాలను సేకరించినట్లు చెప్పారు. ప్రజల నుంచి సేకరించిన సొమ్ముతోనే డిపాజిట్ చెల్లించానని, తన ఆస్తుల విలువ రూ.60,000 మాత్రమే అన్నారు. తన తండ్రి దేవీంద్రప్పకు దాదాపు ఎకరన్నర విస్తీర్ణంగల భూమి ఉందని చెప్పారు.
#WATCH | An independent candidate Yankappa paid his deposit money of Rs 10,000 entirely in one rupee coins while filing his nomination from Yadgir constituency of Karnataka. He collected the coins from people across the constituency, to contest the Karnataka elections on May 10. pic.twitter.com/OIfcLF223d