»Assembly Election Results High Tension In Andhra Pradesh
counting day : పోలీసుల కనుసన్నల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ డే రోజు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది.
Counting day in AP : అంతా ఎదురు చూస్తున్న ఎన్నికల లెక్కింపు రోజు రానే వచ్చింది. ఈ రోజు కోసం పోలీసులు, భద్రతా దళాలు భారీగా రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఎన్నికలు జరిగిన రోజు కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసీ అప్రమత్తం అయ్యింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భద్రతా దళాలను రంగంలోకి దింపారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టుపక్కల మొత్తం రక్షణ వలయంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి మంగళవారం కౌంటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ డే రోజు బందోబస్తు కోసం కేంద్రం నుంచి 50 సీఆర్పీఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో వీరిని ఎక్కువగా మోహరించారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఆర్పీఎఫ్ చీఫ్ చారు సిన్హాలు ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. సోషల్ మీడియాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై సైతం దృష్టి సారిస్తున్నట్లు వారు తెలిపారు.
కౌంటిగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. పోలీస్ 30 యాక్ట్‌ను కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లకు నగర బహిష్కరణ విధిస్తూ ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖుల నివాసాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గ కూడా భద్రతను మరింత పెంచారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకే కాకుండా మరో 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం తమ నిఘాలో ఉంటుందని తెలిపారు.