నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోదీ విఫలమయ్యాడని, భారతదేశం (India) పేరు అంతర్జాతీయ స్థాయిలో మసకబార్చిన బీజేపీ (BJP)కి 2024లో గెలిచే అవకాశాలు అస్సలు లేవని స్పష్టం చేశారు.
తమిళనాడు (Tamil Nadu)లోని చెన్నై (Chennai)లో తెలంగాణ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పర్యటిస్తున్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన ‘2024 ఎన్నికలు- ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో కవిత మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోదీ విఫలమయ్యాడని, భారతదేశం (India) పేరు అంతర్జాతీయ స్థాయిలో మసకబార్చిన బీజేపీ (BJP)కి 2024లో గెలిచే అవకాశాలు అస్సలు లేవని స్పష్టం చేశారు.
చదవండి: Valentine’s Dayపై కేంద్రం వెనక్కి .. Feb 14న కౌ హగ్ డే రద్దు
ఈ చర్చా కార్యక్రమానికి ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్ సర్జ (Arjun Sarja) నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని (Hanuman Temple) సందర్శించారు. ఈ సందర్భంగా కవిత ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అర్జున్ దంపతులు కవితకు ఘనస్వాగతం పలికారు. దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు హీరో అర్జున్ కు కవిత అభినందించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘చెన్నైలో పర్యటించడం నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పది. ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి, భాష, చరిత్ర, వారసత్వంపై గర్వంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలి. ఉమ్మడి ఆలోచనతత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉంది’ అని కవిత తెలిపారు.
ఇక ఆంగ్ల మీడియా చర్చా కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘పారదర్శకత, నిబద్ధతతో పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ తొమ్మిదేళ్లలో వాటిని పాటించలేదు. తన పాలన కాలంలో మోదీ దేశానికి ఏం చేశారు? ఇక మోదీ ప్రభుత్వాన్ని సాగనంపి కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను గుర్తు చేసి వాటి అమలు ఏది అని ప్రశ్నించారు.
పీఎం కిసాన్ పథకం, ప్రతి ఇంటికి తాగునీరు కార్యక్రమాలపై కేంద్రం పార్లమెంట్ (Parliament)లో అబద్ధాలు చెబుతోందని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం (BRS Party) రైతుల ఆదాయం పెంచుతోందని తెలిపారు. రైతుబంధు పథకంలో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంటే పీఎం కిసాన్ పథకంలో రైతుల సంఖ్య తగ్గుతోందని వివరించారు. పార్లమెంట్ లో గంటన్నర సేపు మాట్లాడిన ప్రధాని మోదీ అదానీ కుంభకోణంపై ఎందుకు మాట్లాడలేదని కవిత ప్రశ్నించారు. మోదీ ప్రసంగాన్ని యువత వినాలని సూచించారు. ఆయన ప్రసంగంలో ఎన్నో అబద్ధాలు ఉన్నాయని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని కవిత నిలదీశారు.
కాగా టీఆర్ఎస్ పార్టీ పేరు మారినట్టే కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి పేరు మారింది. భారత్ జాగృతి అని పేరు మారగా.. ఆ సంస్థ ద్వారా ఇక దేశవ్యాప్తంగా తాను పర్యటిస్తానని కవిత పేర్కొన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు తెలంగాణ ప్రజలను జాగృతం చేశామని, చైతన్యం తీసుకొచ్చామని.. ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలను జాగృతం చేస్తామని కవిత ప్రకటించారు. తండ్రి మాదిరి భారత్ జాగృతి ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు కవిత సిద్ధమవుతున్నారు.