విమాన ప్రయాణంలో ప్రయాణికులు రచ్చరచ్చ చేస్తున్నారు. ముష్టిఘాతాలు, బాహాబాహీకి దిగి బీభత్సం సృష్టిస్తున్నారు. దేశీయంగానే కాక అంతర్జాతీయ విమానాల్లోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విమానంలో ఓ మహిళ నానా రభస చేసింది. సిబ్బందిపై దాడి చేయడమే కాక విమానంలో అర్ధ నగ్నంగా తిరుగుతూ వికృత చేష్టలకు పాల్పడింది. తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జనవరి 30న జరిగింది.
అబుదాబీ నుంచి ముంబై వచ్చే విస్తారా (యూకే 256) విమానంలో ఇటలీకి చెందిన పౌల పెర్రుసియో (45) అనే మహిళ ప్రయాణం చేసింది. ఆమె తీవ్రంగా మద్యం సేవించి ఉంది. ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకున్న ఆమె తాను బిజినెస్ క్లాసులోనే కూర్చుంటానని గొడవ చేసింది. సిబ్బంది ససేమిరా అనడంతో వారితో గొడవకు దిగింది. మద్యం మత్తులో ఉన్న ఆమె సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం బట్టలు విప్పేసి అర్ధ నగ్నంగా విమానంలో తిరిగింది. ఎంతకీ వినకపోవడంతో విమాన సిబ్బంది ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుంది. ముంబైలో ల్యాండయిన అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించినట్లు విస్తారా ఓ ప్రకటనలో తెలిపింది.