afternoon sleep good or bad : మధ్యహ్నం కడుపు నిండా భోజనం తిన్నాక నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా? కాదా? అంటే ఓ పావు గంట నుంచి అరగంట లోపు నిద్రపోతే దాని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలసట దూరమవుతుంది. ప్రశాంతత లభిస్తుంది. అందుకనే దీన్ని పవర్ నేప్(nap) అంటారు. అయితే అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోతే మాత్రం దాని వల్ల అనారోగ్యాలు తప్పవు.
మధ్యహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య పగటి నిద్రకు మంచి సమయం అని చెబుతున్నారు నిపుణులు. చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు గరిష్ఠంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. అదే సాధారణ వ్యక్తి అయితే గరిష్ఠంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి. అంతకు మించి నిద్రపోవడం వల్ల దుష్రభావాలు తలెత్తుతాయి.
తిన్న తర్వాత మరీ ఎక్కువ సేపు పడుకోవడం(sleep) వల్ల బరువు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్లు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు కాబట్టి అప్పుడూ ఆకలై ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. దీని వల్ల కొవ్వులు శరీరంలో ఎక్కువగా పేరుకుపోతాయి. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. దీని వెంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధారణ వ్యక్తి మధ్యహ్నం పూట అరగంట కంటే ఎక్కువ సమయం నిద్రించకూడదు. దాని ప్రభావం రాత్రి నిద్ర మీద పడుతుంది. రాత్రి నిద్ర తగ్గిపోయి అది క్రమేపీ నిద్రలేమికీ దారి తీయవచ్చు. పగటి పూట ఎక్కువగా నిద్రించే వారిలో మామూలు వ్యక్తుల కంటే ఎక్కువగా 20 శాతం స్ట్రోక్ వచ్చే ప్రమాదం, 25 శాతం పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి పూట తగినంతగా నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఆందోళన… లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే పగటి నిద్రను తగ్గించుకోవడం, రాత్రి నిద్రను పెంచుకోవడం అవసరం.