Lady Serial Killer: నిర్దోషిగా ‘లేడీ సీరియల్ కిల్లర్’.. 20 ఏళ్లకు క్షమాభిక్ష
ఓ తల్లి తన నలుగురు పిల్లల్ని చంపడంతో ఆమెను సీరియల్ కిల్లర్‌గా కోర్టు ముద్ర వేసింది. అయితే 20 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఆమె తన పిల్లల్ని చంపలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ జైలు నుంచి విడుదల కానుంది.
నలుగురు పిల్లల్ని పొట్టనబెట్టుకున్న కేసులో ఆస్ట్రేలియా(Australia)కు చెందిన ఓ మహిళ 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవించింది. అయితే ఆమె ఆ కేసులో నిర్దోషిగా తేలడంతో ఆమెకు విముక్తి లభించింది. ఆస్ట్రేలియాలో ఆమెకు మహిళా సీరియల్ కిల్లర్ (Serial Killer) అనే ముద్ర పడింది. ఈ మధ్యనే శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా విచారణ చేయగా ఆమె చిన్నారులను హత్య చేయలేదని తేలింది. దీంతో అధికారులు ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించారు. 20 ఏళ్ల తర్వాత ఆమె జైలు నుంచి బయటికొచ్చింది.
న్యూసౌత్ వేల్స్‌కు చెందిన కాథలీన్ ఫ్లోబిగ్(Cathalin Flobin) (55)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉండేవారు. అయితే ఆ పిల్లలు 1989 నుంచి 1999 మధ్య కాలంలో చనిపోయారు. మరణించేటప్పటికి వారంతా 19 రోజుల నుంచి 19 నెలల మధ్య వయసున్న వారే కావడం గమనార్హం. కన్న తల్లే వారిని ఊపిరాడకుండా చేసి హత్య(Murder) చేసిందని కాథలీన్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కోర్టు(Court) విచారణ చేపట్టింది. ఆమె తన డైరీలో పిల్లలను పెంచడం, వాటి కష్టాలపై రాసిన రాతలు, ఇతరత్రా సాక్ష్యాల ఆధారంగా 2003లో ఆమెకు 30 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.
అయితే తాను ఏ తప్పు చేయలేదని కాథలీన్(Cathalin Flobin) న్యాయపోరాటం చేసింది. ఇటీవల ఓ రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కేసును మరోసారి దర్యాప్తు చేపట్టగా ఆమె నిర్దోషి అని తేలింది. ఆ నలుగురు పిల్లలు సహజంగానే మరణించారని పరిశోధకులు నిర్దారించారు. పిల్లల్లో అరుదైన జన్యుపరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ లోపాలే మరణానికి దారి తీశాయన్నారు. తల్లి డీఎన్ఏ(DNA)లోనూ ఆ జన్యు క్రమం కనిపించిందని తేల్చారు. దీంతో ఆ తల్లికి జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. న్యూ సౌత్ వేల్స్ గవర్నర్ ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించడంతో ఆమె జైలు నుంచి విడుదలైంది.