దేశంలోని ప్రధాన పట్టణాల మధ్య రవాణా సమయం తగ్గించేందుకు రైల్వే శాఖ వందే భారత్ రైళ్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వందే భారత్ రైళ్లకు మినీ వర్షన్ గా ‘వందే మెట్రో’ రైళ్లు రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. ప్రధాన పట్టణాలకు సమీప ప్రాంతాల నుంచి వేగంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వందే మెట్రో రైళ్లు తీసుకురానున్నారు.
దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్టం చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రైల్వే శాఖకు మునుపెన్నడూ లేని విధంగా రూ.2.42 లక్షల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ తో పోలిస్తే రూ.లక్ష కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఈ క్రమంలోనే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొత్త వర్షన్ వందే మెట్రో రైలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అంటే వందే మెట్రోతో పట్టణాలకు, పల్లెలకు రైల్వేను అనుసంధానం చేయనున్నారు.
‘వందే భారత్ తరహాలోనే ‘వందే మెట్రో’ను అభివృద్ధి చేస్తున్నాం. పెద్ద నగరాల చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు తమ పనుల కోసం నగరానికి వచ్చి మళ్లీ తిరుగు ప్రయాణమయ్యేలా ‘వందే భారత్ మెట్రో’ను తీసుకురావాలని నిర్ణయించాం. వందే మెట్రోల రూపకల్పన, తయారీ త్వరలోనే పూర్తి చేస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వందే మెట్రోలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైళ్ల ఉత్పత్తిని పెంచుతాం’ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అని తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.