తొలిసారి నిర్వహించిన అండర్-19 టీ20 ప్రపంచకప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఇంగ్లండ్ ను చిత్తు చేసి తొలి ట్రోఫీని చేజిక్కించుకుని సత్తా చాటారు. అండర్-19లో తొలిసారిగా నిర్వహించిన పొట్టి ప్రపంచ కప్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లిష్ అమ్మాయిలు 69 పరుగులు లక్ష్యం విధించగా భారత్ సునాయాసంగా లక్ష్యం సాధించి ప్రపంచకప్ ను ముద్దాడింది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ను భారత బౌలర్లు కట్టుదిట్టం చేశారు. మూకుమ్మడిగా దాడి చేయడంతో 17.1 ఓవర్లలోనే 68 పరుగులకు ఇంగ్లండ్ కుప్పకూలింది. టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం చేధనకు దిగిన భారత్ 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్ సెహ్రావత్ (5), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (24) సత్తా చాటగా.. సౌమ్య తివారి (23), హ్రిషత బసు లక్ష్యాన్ని చేధించి భారత్ కు అండర్-19 టీ20 ప్రపంచకప్ ను అందించారు. అమ్మాయిలు భారత్ ను జగజ్జేతగా నిలువడంతో క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళా క్రికెటర్లను అభినందిస్తూ పోస్టులు చేస్తున్నారు. అమ్మాయిలు ప్రపంచకప్ సాధించడంపై బీసీసీఐతో పాటు భారత క్రికెట్ ఆటగాళ్లు కూడా అభినందనలు తెలుపుతున్నారు. క్రికెట్