ఉత్తరాది రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో భయానక పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలకు దోడా ప్రాతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బస్సుపై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పూంచ్ సెక్టార్ ప్రాంతంలో కూడా వరద నీరు దూసుకురావడంతో ఇద్దరు జవాన్లు దుర్మరణం చెందారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కరుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గంగానదిలో కారు పడిపోయి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో ఇంకా ముగ్గురి జాడ తెలియాల్సి ఉంది.
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల వల్ల ఐదుగురు దుర్మరణం చెందారు. పర్యాటక ప్రాంతం అయిన మనాలీలో భారీ వర్షాలకు, వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మండీ జిల్లా బియాస్ నదిపై ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జి వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని 700 రహదారులపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. స్కూళ్లు, కాలేజీలకు రెండ్రోజులు పాటు సెలవులు ఇచ్చారు. ఆ రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.