ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఆ రాష్ట్రంలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ కాస్త క్రేజ్ ఉందనే చెప్పాలి. ఆయన కూడా… తన పార్టీని కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా.. ఇతర పార్టీల్లోనూ విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ముందుగా గుజరాత్ పై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడం గమనార్హం. త్వరలో అక్కడ జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేయనుంది. ఈ క్రమంలో ఆయన ఇప్పటి నుంచే అక్కడి ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆయన అక్కడ సామాన్య ప్రజలతో సమావేశమయ్యారు.
ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అహ్మదాబాద్‌లో ఆటో డ్రైవర్‌ను నుంచి ఆహ్వానం అందింది. అతను తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని పిలిచాడు. అహ్మదాబాద్‌లో సోమవారం కేజ్రీవాల్ ఆటో రిక్షా డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఓ ఆటో డ్రైవర్.. కేజ్రీవాల్‌ను ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. తాను మీ అభిమానినని, పంజాబ్‌లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోజనం చేసిన వీడియో చూశానని.. అలాగే “ఈరోజు డిన్నర్‌కు మా ఇంటికి వస్తారా..” అని డ్రైవర్ విక్రమ్ లల్తానీ అడిగాడు.
దీనికి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరించారు. తప్పకుండా వస్తానన్నారు. అంతేకాదు “రాత్రి 8 గంటలకు హోటల్ నుంచి నీ ఆటోలో నన్ను తీసుకెళ్తావా..?” అని అడగ్గా విక్రమ్ సంతోషంగా ఒప్పుకున్నాడు. అంతేకాదు తాను పంజాబ్‌లోని ఆటో డ్రైవర్ల ఇళ్లకు వెళ్లానని, వాళ్లు నన్ను ప్రేమిస్తారని కేజ్రీవాల్ చెప్పారు. “నేను పంజాబ్‌లోని ఆటో డ్రైవర్ల ఇళ్లకు వెళ్లాను. పంజాబ్‌లో ఆటో డ్రైవర్లు నన్ను ప్రేమిస్తారు. గుజరాత్లో కూడా నన్ను ప్రేమిస్తారు.” అని అన్నారు. తన పార్టీకి చెందిన మరో ఇద్దరితో ఇంటికి వస్తానని చెప్పారు.