దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించాల్సిన అధికారి కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. జీవితంపైనే విరక్తితో అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు రాసుకున్న లేఖలో ఆయన తెలిపాడు. అనారోగ్య సమస్యలు భరించలేక అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తున్నది.
వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ కు చెందిన శ్రీశైలం నిజామాబాద్ జిల్లా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. గతేడాది ఆయన వరంగల్ నుంచి నిజామాబాద్ కు బదిలీపై వచ్చారు. స్థానికంగా భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. యథావిధిగా బుధవారం కార్యాలయానికి శ్రీశైలం వెళ్లారు. ఆ రోజు సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి అందరి యోగక్షేమాలు కనుకున్నారు. అందరినీ జాగ్రత్తగా ఉండామని సూచించారు. అయితే తండ్రి మాటలు తేడాగా ఉండడం.. కొన్నాళ్ల నుంచి ముభావంగా ఉండడంతో భయాందోళన చెందారు. ఆయన మాటలపై పలు అనుమానాలు రావడంతో హుటాహుటిన కుమారుడు రవితేజ కుటుంబసభ్యులను వెంట పెట్టుకుని వరంగల్ నుంచి నిజామాబాద్ చేరుకున్నారు.
కార్యాలయానికి వెళ్లి చూడగా శ్రీశైలం లోపల గడియపెట్టుకుని ఉన్నాడు. ఎంత సేపయినా తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కిందకు దించి చూడగా అప్పటికే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడి ఆత్మహత్యకు కారణం అనారోగ్యమని తెలుస్తున్నది. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడని కుమారులు తెలిపారు. వాటితో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సూసైడ్ నోట్ లో శ్రీశైలం పేర్కొన్నాడు. తెల్లారితే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాల్సి ఉండగా అధికారి ఆత్మహత్యకు పాల్పడడం నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది.