గత కొన్నేళ్లుగా థియేటర్లలో సినిమా చూసేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూస్తూ ఇంటర్వెల్లో కూల్‌డ్రింక్స్, సమోసాలు తింటూ తెగ ఎంజాయ్ చేసేవాళ్లం. అప్పట్లో తక్కువ ఖర్చుతో సినిమా చూసి ఇంటికి సంతోషంగా వచ్చేవాళ్లం. కానీ మల్టీప్లెక్స్‌లు వచ్చాక ఆ పరిస్థితి మారింది. మూవీ థియేటర్లలో కేఫ్ లు వెలిసి రేట్లకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో సినిమా టికెట్ ధరతో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు పోటీపడుతున్నాయి.
నోయిడా పీవీఆర్ సినిమాస్‌లో పాప్ కార్న్, పెప్సీకి ఏకంగా రూ.460, రూ.360 చెల్లించుకోవాలి. దీనిపై ఇటీవలె ఓ వ్యక్తి ట్వీట్ చేస్తూ తన బాధను వ్యక్తం చేశాడు. ప్రైమ్ వీడియో వార్షిక సబ్స్క్రిప్షన్ ధర అంత ఉందని ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుటుంబంతో కలిసి సినిమా చూడటం ఇకపై ఏమాత్రం భరించలేమని ఆ వ్యక్తి ట్వీట్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. దానిపై పీవీఆర్ సినిమాస్ స్పిందిస్తూ ఓ నోట్ షేర్ చేసింది.
పీవీఆర్ సినిమాస్ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తుందని, దేశంలోని సినీ ప్రియులందరికీ ఓ కొత్త అప్ డేట్‌ను అందిస్తున్నామని ట్వీట్ చేసింది. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లను తగ్గిస్తూ పీవీఆర్ సినిమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ లిమిటెడ్ పాప్ కార్న్, పెప్సీ ఫ్రీ రీఫిల్స్ ను వీకెండ్ ఆఫర్‌గా అందిస్తున్నట్లు తెలిపింది. వీక్ డేస్‌లో మాత్రం సోమవారం నుంచి గురువారం వరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బర్గర్, సమోసా, శాండ్విచ్, పెప్సీ వంటివి పీవీఆర్ రూ.99లకే ఇస్తున్నట్లు వెల్లడించింది.