»From April To June The Heat Wave Increase Imd Forecast 2023
Heat Wave: వచ్చే 90 రోజులు ఎండల బీభత్సం!
దేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం వెల్లడించింది. మధ్య, తూర్పు, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
ఎండాకాలం వచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ(IMD) శనివారం హెచ్చరించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల మినహా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఎక్కువ హీట్‌వేవ్ ఉండే అవకాశం ఉందని IMD స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలలో హీట్‌వేవ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వర్చువల్ విధానంలో వివరాలను వెల్లడించారు.
2023లో ఈ వేడి వాతావరణం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు ఏప్రిల్‌లో భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో చెప్పింది.
వాతావరణ పరిస్థితిని హీట్‌వేవ్‌గా వర్గీకరించడానికి వివిధ పరిస్థితులు ఉన్నాయి. వాటిలో రెండు షరతులు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత కనీసం 40 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ. ఇక కొండ ప్రాంతాలకు కనీసం 30 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ప్రాంతం హీట్‌వేవ్ లో ఉన్నట్లు పరిగణించబడుతుంది. ఆ క్రమంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరినపుడు హీట్‌వేవ్ గా పరిగణించబడుతుంది. దీంతోపాటు ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెంటీగ్రేడ్ కు చేరుకున్నప్పుడు దానిని తీవ్రమైన హీట్‌వేవ్ అని పిలుస్తారు.