జార్ఖండ్ (Jharkhand) కు చెందిన ఓ మహిళా ఉద్యోగి తొలి పోస్టింగ్‌లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడెర్మ సహకార సంఘంలో రిజిస్ట్రార్ అసిస్టెంట్ గా మిథాలీ శర్మ (Mithali Sharma) 8. నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. రూ.20,000 లంచం డిమాండ్ చేసి, తొలి విడతలో రూ.10,000 తీసుకుంటుండగా.. ఏసీబీ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరణ ప్రకారం, మిథాలీ శర్మ తొలుత కోడర్మా జిల్లా(Koderma District)లోని వ్యాపార్ సహ్యోగ్ సమితిలో ఆకస్మిక తనికీ నిర్వహించారు. ఆ సందర్భంగా అక్కడి లావాదేవీలు పరిశీలించగా లెక్కల్లో రూ.20 వేల మేరకు తేడా కనిపించింది. దీంతో, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు. అయితే, మిథాలీ డిమాండ్‌పై ఆ సంస్థ సిబ్బంది ఒకరు అవినీతి నిరోధక శాఖ డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు పక్కా ప్లాన్‌తో ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.