fake doctor: గూగుల్ సాయంతో నాలుగేళ్లుగా వైద్యం..అరెస్టైన నకిలీ వైద్యుడు!
గూగుల్ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న ఫేక్ వైద్యుడు సెంబియన్(31)ని తమిళనాడులో అరెస్టు చేశారు. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదవిన సెంబియన్ తన పేరుమీద ఉన్న నిజమైన డాక్టర్ ప్రొఫెల్ మార్చి డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఏరోనాటికల్ ఇంజినీరింగ్(aeronautical engineering) చేసిన ఓ వ్యక్తి వైద్య వృత్తిపై కన్నేశాడు. అంతటితో ఆగలేదు. ఏకంగా తానే డాక్టరుగా మారి వైద్యం చేయాలనుకున్నాడు. ఆ క్రమంలో తన పేరుతో ఉన్న ప్రముఖ డాక్టర్ ప్రొఫైల్ స్థానంలో తన ఫోటో, అడ్రస్ మార్చి కొన్నేళ్లుగా వైద్యం కూడా చేశాడు. డౌట్ వచ్చినప్పుడల్లా గూగుల్ సాయంతో నకిలీ వైద్యం(fake treatment) చేసేవాడని తెలిసింది. అంతేకాదు మూడు నెలల క్రితం తారామణి ప్రాంతంలో స్పార్క్ ఫ్యామిలీ క్లినిక్ పేరుతో కొత్తగా ఏకంగా హాస్పిటల్ కూడా మొదలుపెట్టాడు.
అయితే ఉన్నత చదువులు పూర్తి చేసిన అసలు డాక్టర్(doctor) సెంబియన్ తన ప్రొఫైల్‌ను అప్డేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తంజావూరు(thanjavur)కు చెందిన నిజమైన డాక్టర్ సెంబియన్ ఇప్పుడు ఢిల్లీ(delhi)లో మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తారామణిలోని ఓ క్లినిక్‌లో తన పేరు చెప్పుకుని ఎవరో మెడిసిన్ చేస్తున్నట్టు గుర్తించారు. అతని ఫిర్యాదు ఆధారంగా తమిళనాడు మెడికల్ కౌన్సిల్(tamilnadu medical council), పోలీసులతో కలిసి ఈ ఫేక్ ఇంజినీర్ క్లినిక్‌పై దాడి చేశారు. ఆ పత్రాలు నకిలీవని గుర్తించిన పోలీసులు(police) అతడిని అరెస్ట్(arrested) చేశారు. తాజాగా అసలు విషయం బయటపడ్డాక పోలీసులు నకిలీ వైద్యుడు(fake doctor) సెంబియన్పై కేసు నమోదు చేశారు. ఈ స్కామ్‌లో సెంబియన్కు మెడికల్ కౌన్సిల్ అధికారులు, సిబ్బంది ఎవరైనా సహకరించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా నకిలీ వైద్యుడు సెంబియన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసు బృందం అతని క్లినిక్ నుంచి రూ.1.14 లక్షల నగదుతోపాటు మందులు, సిరంజిలు, మెడికల్ రసీదులను స్వాధీనం చేసుకుంది. అతను డాక్టర్ సాయే లక్ష్మి పేరు మీద అల్లోపతి మందులను పెద్ద మొత్తంలో పొందగా, అతను అతని పేరు మీద సిద్ధ, ఆయుర్వేద మందులను కొనుగోలు చేశాడు. క్లినిక్‌లోని సౌకర్యాలను వినియోగించుకున్నందుకు ప్రతి నెలా డాక్టర్ సాయి లక్ష్మికి రూ.20,000 చెల్లించినట్లు సుదర్శన్ కుమార్ పోలీసులకు తెలిపాడు. మరోవైపు అతను ఫేక్ డాక్టర్ అని, దుర్వినియోగం చేస్తున్నాడని తనకు తెలియదని డాక్టర్ సాయి లక్ష్మి చెప్పారు.
మైలదుతురై జిల్లాకు చెందిన నిందితుడు సెంబియన్ (31) 2012లో పుదుకోట్టైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదివాడు. 2017లో ఉద్యోగం వెతుక్కుంటూ చెన్నై వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో మూడు నెలలు పనిచేశాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మార్కెటింగ్ ఉద్యోగంలో చేరాడు. ఆ క్రమంలోనే వైద్య వృత్తిపై మక్కువ పెంచుకున్నాడు. మరోవైపు అందుకోసం ఫస్ట్ ఎయిడ్, ఫైర్ అండే సెఫ్టీ, స్కాన్ వంటి డిప్లొమా కోర్సులను కూడా అభ్యసించాడు. ఆ తర్వాత గూగుల్(google) ద్వారా తన పేరు మీద ఉన్న డాక్టర్ల వివరాలు తెలుసుకుని వివరాలు మార్పు చేసుకున్నాడు. ఇక తర్వాత కూడా అదే గూగుల్(google) సాయంతో వైద్యం చేయడం ప్రారంభించాడు. కొన్ని రోజులు నీలాంగరైలోని అస్త్ర ఆసుపత్రిలో కూడా సెంబియన్ పని చేశాడు. అంతేకాదు కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో అతనిపై ఎవరకి కూడా అనుమానం రాలేదు.