మయన్మార్, ఉత్తర కాలిఫోర్నియాలో నేడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. గత రెండు రోజులకు ముందు పసిఫిక్ మహాసముద్రం పరిసర ప్రాంతంలో కూడా రెండు సార్లు భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
ఈ మధ్యకాలంలో వరుస భూకంపాలు(Earthquakes) సంభవిస్తున్నాయి. తాజాగా మయన్మార్, కాలిఫోర్నియాలో భూకంపాలు సంభవించాయి. రెండు రోజుల క్రితం పసిఫిక్ మహాసముద్రం సరిహద్దు ప్రాంతంలో వరుసగా భూకంప ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నేడు మయన్మార్ లో స్వల్ప భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు భూకంపం సంభవించిందని, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా(power Supply) ఆగిపోయింది.
ఉత్తర కాలిఫోర్నియాలో కూడా నేడు భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో భూమి కంపించిందని, అయితే దీని వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.
మే 19న పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. అలాగే మే 20న అదే ప్రాంతంలో మరోసారి 7.1 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. దీంతో అధికారులు సునామీ(Tsunami) హెచ్చరికలను కూడా జారీ చేశారు. ప్రజలను అప్రమత్తం చేశారు. వరుస భూకంపాల నేపత్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.