»Delhi Liqour Scam Kalvakuntla Kavitha Reached To Enforcement Directorate Office
Breaking: విచారణకు హాజరైన కవిత.. అరెస్ట్ కు అవకాశం?
పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలనే భావిస్తున్నారు. అయితే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఆమె తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారని సమాచారం. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. వాస్తవంగా మార్చి 9న గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉన్న కవిత ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో శనివారం వస్తానని ఈడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో నేడు ఆమె విచారణకు హాజరయ్యారు.
కాగా విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఆందోళనకర పరిస్థితులు అలుముకున్నాయి. నివాసం ముందు ‘కవితక్క సంఘర్ష్ కరో.. హమ్ తుమ్హారే సాత్ హై’ అని పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. మూడు రోజులుగా సీఎం నివాసంలోనే కవిత మల్లగుల్లాలు చేస్తున్నారు. కాగా విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు భారీగా మొహరించారు.
న్యాయ నిపుణులతో పార్టీ చర్చలు
విచారణ అనంతరం అరెస్ట్ ఉంటుందనే వార్తల నేపథ్యంలో న్యాయ నిపుణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్ రావు తదితరులు చర్చలు జరుపుతున్నారు. ఇక తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ లో కూడా కేసీఆర్ చర్చలు చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే దానిపై సమీక్షిస్తున్నారు. పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలనే భావిస్తున్నారు. అయితే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఆమె వెంట భర్తతో పాటు మరికొందరు పార్టీ నాయకులు ఉన్నారని తెలుస్తున్నది.
కాగా ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో క్షణ క్షణం ఉత్కంఠగా మారింది. కవిత విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఆసక్తికర చర్చ సాగుతోంది. కాగా ఢిల్లీలో గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మకాం వేశారు. కాగా ఢిల్లీలో కవిత పేరిట వెలసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షించాయి. కవితకు మద్దతుగా బ్యానర్లు వెలిశాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్ వాషింగ్ పౌడర్ నిర్మా ప్రకటనలు ఆసక్తికరంగా మారాయి. కవితపై బీజేపీ కుట్రలు సాగవనే రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేశారు.