»Danger If Pan Aadhaar Is Not Linked Cbdt Extended Deadline June 30th 2023
PAN AADHAAR: పాన్ ఆధార్ లింక్ చేయకపోతే డేంజర్..గడువు పెంచిన CBDT
పన్ను చెల్లింపుదారులు తమ పాన్, ఆధార్‌ను(PAN AADHAAR) లింక్(link) చేయడానికి మరికొంత సమయం ఇవ్వడానికి గడువును పొడిగించినట్లు CBDT తన నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్ 30, 2023 వరకు పొడగిస్తున్నట్లు వెల్లడించింది. జూలై 1 నుంచి లింక్ చేసుకోని వారు ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోలేరని CBDT స్పష్టం చేసింది.
మీరు ఆధార్ కార్డుకు పాన్ కార్డు(PAN AADHAAR) ఇంకా లింక్ చేయలేదా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే. ఎందుకంటే పాన్-ఆధార్ అనుసంధానం గడువు జూన్ 30, 2023 వరకు పొడిగిస్తున్నట్లు(extended) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) వెల్లడించింది. ఇది వరకు మార్చి 31 వరకు గడువు ఉండగా తాజాగా జూన్ వరకు పెంచారు. రెండింటిని లింక్ చేయడం ద్వారా నిర్దిష్ట సేవలను పొందేందుకు తప్పనిసరి కానుంది.
ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుకు పాన్ లింక్ చేయకపోతే ఫలితంగా ఆయా వ్యక్తులు జూలై 1, 2023 నుంచి ఆర్థిక లావాదేవీలను నిర్వహించలేరని CBDT హెచ్చరించింది. ఈ క్రమంలో వినియోగదారులు నిర్ణీత గడువులోగా రెండింటినీ లింక్ చేయడంలో విఫలమైతే వారి పాన్ కార్డ్‌లు ‘నిష్క్రియం’ కావచ్చని తెలిపింది.
అయితే ఇప్పటికే ఆధార్-పాన్ ఉచితంగా అనుసంధానం కోసం ఇచ్చిన గడువు ముగియడంతో మార్చి 31 వరకు రూ.1000 రుసుముతో అవకాశం కల్పించారు. దానిని తాజాగా జూన్ 30, 2023 వరకు పొడిగించారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు తమ పాన్, ఆధార్‌ను లింక్ చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో పెంచినట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో ఆన్లైన్ విధానం ద్వారా శాశ్వత ఖాతా సంఖ్య (PAN )తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయవచ్చని వెల్లడించారు. ఈ రెండింటిని లింక్ చేయడానికి ప్రజలు ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారిక ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అధికారులు సూచించారు. ఆన్లైన్లో పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడం సౌకర్యంగా లేని వారు ఆఫ్‌లైన్ విధానంలో NSDL, UTITSL పాన్ సేవా కేంద్రాల ద్వారా చేసుకోవాలని సూచించారు.
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం భారతదేశ పౌరుడు కాని వ్యక్తి లేదా మునుపటి సంవత్సరంలో ఎప్పుడైనా ఎనభై ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు పాన్-ఆధార్ లింకింగ్ నుంచి మినహాయింపు పొందవచ్చు.