»Congress Party Suspends To Janga Raghava Reddy As Jangaon Dcc President
Congress Partyలో గ్రూపు రాజకీయం.. జనగామ జిల్లా అధ్యక్షుడు సస్పెండ్
సస్పెండ్ తో జనగామతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. కాగా పార్టీ నిర్ణయంతో రాఘవరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తున్నది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (TPCC)లో అసంతృప్తులు ఇంకా చల్లారలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి పార్టీ వర్గాలు సహకరించడం లేదు. అతడి నిర్ణయాలను పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు తమ సొంత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు పాదయాత్రలు సొంతంగా చేస్తున్నారు. తాము పోటీ చేసే స్థానాలను కూడా ప్రకటించుకుని క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనగామ పార్టీ అధ్యక్షుడు (Jangaon District) జంగా రాఘవరెడ్డి (Janga Raghava Reddy) కూడా ఇదే ధోరణితో కొనసాగుతున్నాడు. అయితే అతడి వైఖరిపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జనగామ జిల్లా పార్టీలో గందరగోళం ఏర్పడింది.
‘కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి నష్టం వాటిల్లేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జంగా రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగిస్తున్నాం. పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వ రద్దు చేయడంతోపాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం’ అని హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనతో జనగామ జిల్లాలో జంగా రాఘవరెడ్డి అనుచరులు మండిపడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District)లో కాంగ్రెస్ పార్టీకి కీలక నాయకుడు జంగా రాఘవరెడ్డి. జిల్లాల విభజనతో జనగామ డీసీసీ బాధ్యతలను పార్టీ రాఘవరెడ్డికి అప్పగించింది. అయితే రాఘవరెడ్డి మాత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేది నేనే అని జంగా రాఘవరెడ్డి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతే కాకుండా ఆ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నాడు. పాదయాత్ర కూడా దిగడంతో పార్టీకి ఫిర్యాదులు అందాయి.
దీంతోపాటు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డితో రాఘవరెడ్డికి విబేధాలు ఉన్నాయి. ఈ పంచాయితీ గాంధీ భవన్ కు చేరింది. రాఘవరెడ్డి తీరుపై ఫిర్యాదు రావడంతో పార్టీ స్పందించింది. ఈ నేపథ్యంలోనే అతడిని సస్పెండ్ చేస్తూ రాజేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ తో జనగామతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. కాగా పార్టీ నిర్ణయంతో రాఘవరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తున్నది.