»Coming Back Into Direct Politics Former Minister Raghuveera Reddys Announcement
Raghuveera Reddy: మళ్లీ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తున్నా.. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ప్రకటన
ఏపీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) కీలక ప్రకటన చేశారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిణామాల వల్ల మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.
ఏపీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) సంచలన ప్రకటన చేశారు. మళ్లీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని అంటున్నారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుందామనుకున్నానని, కానీ కొన్ని పరిణామాలతో తన మనసు మార్చుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని ఒక్క మాట అన్నందుకే.. ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం బాధ కలిగించిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం భావ్యమా అని ఆలోచించానని చెప్పుకొచ్చారు. అందుకే తాను మళ్లీ ప్రజల ముందుకు వస్తానని వెల్లడించారు.
తన సొంత గ్రామం నీలకంఠాపురం(Neelakanthapuram)లో ఆలయ(temple) నిర్మాణం కోసం నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నట్లు రఘువీరా చెప్పారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని.. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. తనను పార్టీ బెంగళూరు నగర ఎన్నికల పరిశీలకుడిగా నియమించిందని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వెళ్లి అక్కడి అభ్యర్థుల విజయం కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. రాహుల్ ను అవమానించడం వల్లే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడతారని చెప్పారు. తనను అభిమానించేవారు చెప్పినట్లుగా భవిష్యత్తులో నడుచుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు.
రఘు వీరారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(ap) మంత్రిగా పనిచేశారు. ఆయన మడకశిర నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొణిజేటీ రోశయ్య ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగారు. అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వత రఘువీరాకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన ఊరిలో ఆలయ నిర్మాణం పనుల్లో బిజీ అయ్యారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రారని భావించారు.. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్నారు.