Hyderabad కుంగిన మరో రోడ్డు.. వరుస గుంతలకు కారణాలు ఇవే..
ఎక్కడెక్కడ ఉన్నాయో ముందే తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్ లో భూకంపం మాదిరి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఘటనలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా అకస్మాత్తుగా రోడ్డు (Road) కుంగిపోతుంది. చడీచప్పుడు లేకుండా రోడ్డు ఒక్కసారిగా గుంతలు ఏర్పడుతుండడంతో వాహనదారులతో పాటు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఉన్నట్టుండి రోడ్డు కుంగడంపై ఆందోళన చెందుతున్నారు. రోడ్డు కుంగిన సమయంలో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల (Accidents)కు గురవుతున్నారు. ఈ సంఘటనలు హైదరాబాద్ (Hyderabad) రోడ్లపై తరచూ చోటుచేసుకుంటున్నాయి. నెల రోజుల వ్యవధిలో రెండు సంఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా మూడోసారి మరో చోట రోడ్డు కుంగిపోయింది. నడి రోడ్డుపై భారీ గుంత (Hole) ఏర్పడింది. అత్యంత రద్దీగా ఉండే రోడ్డులో గుంత ఏర్పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయ్యింది. అయితే ఏ క్షణాన ఎక్కడ ఏ రోడ్డు కుంగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (MGBS) నుంచి చాదర్ ఘాట్ (Chaderghat) మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. దాదాపు 20 ఫీట్ల మేర రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. వాహనాలు వెళ్తున్న క్రమంలోనే ఈ గుంత ఏర్పడింది. అయితే గుంతపై వెళ్తున్న వారు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డును పరిశీలించగా లోతు భారీగా ఉంది. బారికేడ్లు పెట్టి వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఉన్నత అధికారులకు అక్కడికి చేరుకుని రోడ్డును పరిశీలించి కారణాలు తెలుసుకుంటున్నారు. గుంతను మూసివేసి రోడ్డు తిరిగి నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని ఆజంపురా వాటర్ వర్క్స్ (Water Works) అధికారులు తెలిపారు.
అయితే హైదరాబాద్ లో రోడ్డు కుంగడం ఇది మూడోసారి. గోషామహల్ (Goshamahal)లో 100 మీటర్ల మేర రోడ్డు కుంగిపోయింది. సంత రోజు కూరగాయల బండ్లు ఏర్పాటు చేసుకుంటుండగా ప్రమాదం జరిగింది. దీంతో పదుల సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. వారం కింద హిమాయత్ నగర్ (Himayatnagar)లో కూడా నడిరోడ్డుపై గుంత ఏర్పడింది. స్ట్రీట్ నంబర్ 5లో రోడ్డుపై 10 అడుగుల మేర గుంత ఏర్పడింది. మట్టి లోడ్ తో వెళ్తున్న ట్రక్కు ఆ గుంతలో కూరుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. అంతకుముందు రెండేండ్ల కింద హుస్సేన్ సాగర్ ఒడ్డున భారీ గుంత ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ గుంత పూడ్చడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టింది.
ఇలా గుంతలు రోడ్డుపై అకస్మాత్తుగా ఏర్పడడానికి కారణాలను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు తెలుసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ అతి పురాతన నగరం. నిజాం (Nizam’s) కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థే ఇంకా కొనసాగుతున్నది. నాలాలు (Nala) కొత్తగా వేసింది లేదు. అప్పుడు వేసిన నాలాలు ప్రస్తుతం పూడ్చివేసి రోడ్లు వేశారు. ఆ నాలాలే ఇప్పుడు కుంగుతున్నాయని సమాచారం. పైగా అడ్డదిడ్డంగా రోడ్లు వేయడం కూడా మరో కారణంగా తెలుస్తున్నది. రోడ్లు వేసేటప్పుడు పాత రోడ్డు తవ్వేసి లోపలి నుంచి నాణ్యతతో రోడ్లు వేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న రోడ్డుపైనే రోడ్డు వేసేసి చేతులు దులుపుకుంటున్నారు. అలా పొరలుపొరలుగా వేసిన రోడ్డు ఇప్పుడు కుంగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ముందే తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్ లో భూకంపం మాదిరి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఘటనలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.