brs mlc Kavitha ex accountant arrested buchi babu in Delhi liquor scam
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. ఈ మేరకు గోరంట్ల బుచ్చిబాబును ఢిల్లీ సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢీల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో భాగంగా బుచ్చిబాబు పాత్ర ఉందని అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ఈ కేసులోని అనుబంధ ఛార్జీషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. ఈ స్కాంలో భాగంగా సౌత్ గ్రూప్ విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చారని ఛార్జీషీటులో ఈడీ పేర్కొంది. కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూపులో భాగమని ఈడీ తెలిపింది.
విజయ్ నాయర్ సూచన మేరకు ఇండోస్పిరిట్లో కవిత 3 కోట్ల 40 లక్షలు, మాగుంట శ్రీనివాస్ 5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు ఈడీ తెలిపింది. కవిత తరఫున అరుణ్ పిళ్లై, మాగుంట తరఫున ప్రేం రాహుల్ ఇండో స్పిరిట్లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పష్టం చేశారు.