బిఅర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో అయా పార్టీలలోని అసంతృప్తులు కెసిఆర్ పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత బిఅర్ఎస్ లో చేరారు. మహాలో పలు ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువ. తెలంగాణ పక్క రాష్ట్రం. ఈ నేపథ్యంలో పార్టీ విధానాలు నచ్చిన పలువురు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిభావు రాథోడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్లో చేరారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సమక్షంలో శనివారం బిఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు బిఅర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనిక నాయకుడిగా కేసీఆర్ తనకు కనిపిస్తున్నారన్నారు.
హరిభావు 2004 నుంచి 2008 వరకు యవత్మాల్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మహారాష్ట్రలో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. 2013 నుంచి 2021 వరకు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ఆయన, ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆల్ ఇండియా బంజారా క్రాంతిదళ్ను స్థాపించి మహారాష్ట్రలో విస్తృతంగా సేవలందించారు.