అధికార పార్టీని తిట్టడమే లక్ష్యంగా పని పెట్టుకున్న తీన్మార్ మల్లన్న కార్యాలయంపై మరోసారి దాడులు జరిగాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై హద్దుమీరి విమర్శలు చేయడం.. వ్యక్తిగతంగా దూషించడం వంటి చర్యతో అతడిపై, అతడి కార్యాలయం క్యూ న్యూస్ పై దుండగులు దాడి చేశారు. ఇది వరకే ఒకసారి దాడి జరిగి ఉండగా.. తాజామా మరోసారి కొందరు కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. హైదరాబాద్ బోడుప్పల్ ఫిర్జాదిగూడలో ఉన్న క్యూ న్యూస్ కార్యాలయంపై ఆదివారం దాడి జరిగింది.
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆధ్వర్యంలో క్యూ న్యూస్ సంస్థ కొనసాగుతున్నది. ఈ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దూసుకొచ్చి ఆఫీస్ లోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ను తదితర వాటిని ధ్వంసం చేశారు. ‘మీ ఇష్టం వచ్చినట్లుగా వీడియోల్లో చూపిస్తారా’ అంటూ దాదాపు 15-20 మంది వచ్చి దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సంస్థ సిబ్బందిపై కూడా దాడి చేశారు. అయితే దాడికి పాల్పడ్డ వారి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒక నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై క్యూ న్యూస్ కో ఆర్డినేటర్ సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వారే దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఈ దాడి విషయమై తీన్మార్ మల్లన్న స్పందించాడు. ‘మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత అనుచరులే దాడికి పాల్పడ్డారు. నేను బయటకు వెళ్లినప్పుడు కార్యాలయానికి వచ్చి దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ గుండాలే ఈ ఘటనకు కారణం. పోలీసులకు తెలిసే దాడి జరిగింది. ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉంది. నాలుగుసార్లు కార్యాలయంపై దాడులు జరిగినా.. వార్తలు ఆగేది లేదు’ అని మల్లన్న స్పష్టం చేశారు. కాాగా ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని మేడిపల్లి పోలీసులు తెలిపారు.
గతంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాషాయ పార్టీతో అంతగా చొరవ చూపడం లేదు. రాజీనామా చేయకుండానే పార్టీకి దూరంగా ఉన్నాడు. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చారు. కొద్ది పాటి ఓట్లతో అతడు పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.
20 workers of coward @BRSparty attacked Prominent YouTube Journalist @TeenmarMallanna office & manhandled his staff with iron rods & sticks.