ఆంధ్రప్రదేశ్ లో వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ (JanaSena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీ పర్యటన చేపట్టడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు పవన్ ఢిల్లీ (New Delhi) వెళ్లారు. బీజేపీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో జనసేన పార్టీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. కాగా ఈ పర్యటన ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
రాజస్థాన్ (Rajastan)లోని ఉదయ్ పూర్ (Udaipur)లో ఆదివారం పర్యటించిన పవన్ అటు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంటనే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తో పాటు మరికొందరు ఉన్నారు. ఈ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు మరికొంత మంది కీలక నాయకులు పవన్ కలువనున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించనున్నారని సమాచారం. ఏపీలో బీజేపీ జనసేకు మధ్య దూరం పెరుగుతున్న క్రమంలో ఈ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సాగిస్తున్న అరాచక పాలనపై కేంద్రానికి పవన్ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. వైసీపీ దాడులు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో మాట్లాడనున్నారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలతో చర్చించేందుకు ఢిల్లీకి పయనమయ్యాడని చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని జనసేన భావిస్తుండగా.. బీజేపీ మాత్రం పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే పవన్ ను బుజ్జగించేందుకు బీజేపీ ఢిల్లీకి పిలిచిందని తెలుస్తున్నది.