APలో రావణ సైన్యం అది, ఆయన ప్యాకేజీ స్టార్.. కావలి సభలో సీఎం జగన్
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రావణ సైన్యం ప్రజల ముందుకు వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని కావలి సభలో జనాలకు సూచించారు.
AP CM Jagan:వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. రైతులను పట్టించుకోవడం లేదని.. తాము పర్యటిస్తేనే పంట కొనుగోలు చేస్తుందని విమర్శించారు. ఆ కామెంట్లపై సీఎం జగన్ (CM Jagan) స్పందించారు. నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో ఏటా 300 కరువు మండలాలు ప్రకటించారని గుర్తుచేశారు. ఆ రోజున అన్నదాతల సమస్యలను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గరపడగ మరోసారి వస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ రైతు బాంధవులు వేషం వేసి వస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని కోరారు. రావణ సైన్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 భాగస్వాములు అని విమర్శించారు. వీరంతా రామాయణంలో శూర్పణఖ మాదిరిగా దొంగ ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తానని మోసం చేశారని తెలిపారు. ఐదేళ్లలో ఇచ్చింది రూ.16,500 కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. ఇంత జరిగిన దత్తపుత్రుడు ప్రశ్నించడు.. ఈనాడు, జ్యోతి, టీవీ 5 కథనాలు రాయవని గుర్తుచేశారు. సున్న వడ్డీ పథకం రద్దు చేశారని గుర్తుచేశారు.
వ్యవసాయం దండగ అన్న బాబు ఓ వంక.. మరోవైపు ప్యాకేజీ స్టార్ అని సీఎం జగన్ విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతుండగా బాబుకు డేట్లు ఇచ్చి.. బాబు స్క్రిప్ట్ రాసిన.. పొలిటికల్ ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ అని విమర్శించారు. వీరికి ఎల్లో మీడియా.. తన అంటే తందానా అంటుందని ధ్వజమెత్తారు. వీరి డ్రామాలు నమ్మకండి.. వీళ్లు వస్తే తప్ప ధాన్యం కొనుగోళ్లు చేయలేదు అని చెప్పే మాటలు నమ్మకండి. మరీ నాలుగు ఏళ్లుగా ఎలా ధాన్యం కొనుగోలు చేశామని అడిగారు. తమ ప్రభుత్వం రైతన్నకు తోడుగా ఉందని స్పష్టంచేశారు.
చుక్కల భూములకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపించారు. నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాల భూముల సమస్య తీరింది. చంద్రబాబు హయాంలో చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో భూములు అమ్ముకునే పరిస్థితి లేదు.. అలాగే భూముల హక్కుతో బ్యాంకు రుణం తీసుకునే వెసులుబాటు లేదు. ఆ సమస్యను పరిష్కరించామని సీఎం జగన్ తెలిపారు. చుక్కల భూములపై రైతులందరికీ పూర్తి హక్కు కల్పించామని తెలిపారు. రైతుల కష్టం చూశాను.. మీకు నేను ఉన్నానని సీఎం జగన్ భరోసా కల్పించారు. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూ సర్వే వేగంగా జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 2 వేల గ్రామాల్లో భూ సర్వే వేగంగా చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 20వ తేదీన 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఆర్బీకేల ద్వారా రైతులకు మేలు జరిగిందని సీఎం జగన్ వివరించారు. దళారీ వ్యవస్థ, మిల్లర్ల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు జరిగిందని చెప్పారు. ఉచితంగా సరిహద్దు రాళ్లు కూడా వేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు.