»Another Twist In The Drug Case Hero Navdeep On The Run Notices To Baby Makers
Drugs Case: డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. పరారీలో హీరో నవదీప్, బేబీ మేకర్స్‌కు నోటీసులు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నారని, బేబీ సినిమాలోని దృశ్యాలే స్పాట్ లో కనిపించాయని తెలిపారు. బేబీ మేకర్స్‌కు నోటీసులు ఇవ్వనున్నామన్నారు.
హైదరాబాద్ (Hyderabad)లోని మాదాపూర్ డ్రగ్స్ కేసు (Madhapur Drugs Case)లో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నార్కోటిక్ పోలీసుల (Narcotic Police) అదుపులో మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నారు. 18 మందిలో ఐదుగురు డ్రగ్స్ కన్జ్యూమర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వీరికి డ్రగ్స్ సరఫరా చేసిన నైజీరియన్లు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. మాదాపూర్‌లో పోలీసులు రైడ్ చేసినప్పుడు 50 గ్రాముల ఎండీఎంఏతో పాటుగా 8 గ్రాముల కొకైన్, 24 ఎస్టసీ పిల్స్‌ను సార్కోటిక్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలను వెల్లడించారు.
మాదాపూర్‌లో తమ బృందం రైడ్ చేసినప్పుడు అక్కడంతా బేబీ సినిమాలోని దృశ్యాలే కనిపించాయన్నారు. బేబీ సినిమా డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించేలా ఉందన్నారు. అందుకే బేబీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ పార్టీలో హీరో నవదీప్ (Hero Navadeep) కూడా ఉన్నారన్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో కూడా పలు డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా ఉన్నాడని ఆయన గుర్తు చేశారు.
నవదీప్ స్నేహితుడు రాంచందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP Cv.Anand) వెల్లడించారు. ఇదిలా ఉండగా హీరో నవదీప్ తనకు ఆ డ్రగ్స్ కేసుతో ఎటువంటి సంబంధం లేదన్నారు. తాను పరారీలో లేనని, ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని నవదీప్ తెలిపారు. తనపై డ్రగ్స్ కేసు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.