»Alert For Those Going To Tirumala Ttd Has Given Key Instructions
TTD: తిరుమలకు వెళ్లేవారికి అలర్ట్..కీలక సూచనలు చేసిన టీటీడీ
తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని తెలిపింది. అలాగే మెట్లమార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
తిరుమల(Tirumala)లో బాలుడిపై చిరుత దాడి(Cheetah Attack) చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలతో భయటపడ్డాడు. ఏడవ మైలు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత బాలుడ్ని లాక్కెళ్లింది. బాలుడి తాత, యాత్రికులు, పోలీసు సిబ్బంది కేకలు వేయడంతో చిరుత బాలుడ్ని వదిలి వెళ్లిపోయింది. చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి(TTD EO Dharmareddy) ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడారు.
బాలుడిపై చిరుత దాడి(Cheetah Attack) ఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ(TTD) ఆరా తీస్తోంది. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా రాత్రి 6 గంటల తర్వాత నడక అనుమతి నిలిపి వేసేందుకు టీటీడీ ఆలోచిస్తోంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మెట్ల మార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు.
చిన్నారి కౌశిక్‌ను టీటీడీ(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించి బాలుడి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడారు. మరోవైపు నడక మార్గంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్తున్న భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచించింది. అలాగే మైక్‌ల ద్వారా విజిలెన్స్ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్న ప్రకారం నడుచుకోవాలని తెలిపింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారంపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఫారెస్ట్ అధికారి సతీష్ తెలిపారు.