»200 Tv Channels For Free Without Set Top Box Coming Soon India
Anurag Thakur: త్వరలో సెట్ టాప్ బాక్స్ లేకుండానే ఫ్రీగా 200+ టీవీ ఛానెళ్లు!
దేశంలో సెట్ టాప్ బాక్స్ లేకుండా వినియోగదారులు ఉచితంగా 200+ టీవీ ఛానెళ్లు వీక్షించే సౌకర్యం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
త్వరలో దేశంలో సెట్ టాప్ బాక్సు(set top box)లకు కాలం చెల్లనుందా. అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ఉచితంగా అందించే దూరదర్శన్ సహా పలు ఛానెళ్లను ప్రజలు వీక్షించేందుకు కూడా సెట్ టాప్ బాక్స్(set top box) తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో వినియోగదారులకు ఎక్కువగా ఆర్థిక భారం పడుతుంది. ఈ నేపథ్యంలో సెట్ అప్ బాక్స్ త్వరలో తొలగించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. అయితే త్వరలో రానున్న టెలివిజన్‌లో అంతర్నిర్మిత శాటిలైట్ ట్యూనర్ అమర్చి టీవీలను తయారు చేయించనున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రత్యేక సెట్-టాప్ బాక్స్ అవసరం లేకుండానే దాదాపు 200 ఛానెల్స్(200+ channels) వీక్షకులు ఉచితంగా(free) వీక్షించే అవకాశం ఉంటుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ క్రమంలో టెలివిజన్, రేడియో ఛానెల్‌లను యాక్సెస్ చేయవచ్చని చెప్పారు. అందుకోసం తమ ఇంటి పైకప్పు లేదా ప్రక్క గోడ వద్ద వంటి తగిన ప్రదేశంలో మాత్రమే చిన్న యాంటెన్నాను మాత్రమే అమర్చుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
ఇప్పటికే దూరదర్శన్(doordarshan) తన ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్‌లను అనలాగ్ ట్రాన్స్మిషన్ నుంచి డిజిటల్ శాటిలైట్ ట్రాన్స్మిషన్ వరకు దశల వారీగా ప్రసారం చేయడం ప్రారంభించింది. ఈ అంశంపై గత ఏడాది అనురాగ్ ఠాకూర్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి కూడా లేఖ రాశారు. అంతర్నిర్మిత శాటిలైట్ ట్యూనర్ల ఏర్పాటు కోసం బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ (BIS) ప్రమాణాలను స్వీకరించడానికి టెలివిజన్ సెట్ల తయారీదారులకు మార్గదర్శకాలను జారీ చేయాలని అభ్యర్థించినట్లు వెల్లడించారు.
గత 7-8 సంవత్సరాలుగా దూరదర్శన్ ఛానళ్లకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. 2015 నుంచి దూరదర్శన్(doordarshan) ఫ్రీ డిష్‌ని కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య రెట్టింపు అయింది. ఫ్రీ డిష్(free dish) వినియోగదారులు 2015లో 20 మిలియన్ల నుంచి 2021 నాటికి 43 మిలియన్లకు పెరిగారని KPMG నివేదిక పేర్కొంది. మరోవైపు పాఠశాల విద్యపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల విద్య కోసం ఛానళ్లను ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఆదేశించారు. దీంతో కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు విద్యను అందించడానికి 1 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం స్వయం ప్రభ ఛానెల్‌లు ప్రారంభించబడి పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చాయి. విద్యా ప్రయోజనాల కోసం విడిగా సొంత ఛానెల్‌లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రం కోరినట్లు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే అలాంటి ఛానెల్స్ 55 వరకు ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఫ్రీ డిష్‌లో సాధారణ ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌ల సంఖ్య కూడా పెరిగిందని ఆయన వెల్లడించారు.