కేంద్ర ప్రభుత్వం మహిళల గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని 75 లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ (Gas connection) ఇవ్వనుంది. గ్యాస్ స్టవ్‌తో పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద వీటిని అందించనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద గ్యాస్ స్టవ్‌తో ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదలందరికీ ఈ పథకం వర్తించనుంది. 2026 మార్చి 31 కల్లా 75 లక్షల మంది పేదలకు కొత్తగా ఎల్పీజీ గ్యాస్ (LPG gas) స్టవ్, సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.
ఉజ్వల యోజన (Ujjwala Yojana) పథకం కొనసాగింపులో బాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1650 కోట్ల ఖర్చు అవుతందని అంచనా వేయగా.. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కొ ఎల్పీజీ కనెక్షన్ కోసం రూ.2200 ఖర్చు చేయనున్నారు. తొలుత ఈ ఖర్చును గ్యాస్ కంపెనీలు భరించనున్నాయి. ఆ తర్వాత ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. ప్రస్తుతం 9.60 కోట్ల మంది మహిళలు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
కొత్త ఉచిత LPG కనెక్షన్ల పంపిణీ తర్వాత, లబ్దిదారుల సంఖ్య 10 కోట్లు దాటుతుంది. రానున్న మూడేళ్లలో ఈ 75 లక్షల కనెక్షన్లు పంపిణీ చేస్తామని ప్రధాని మోదీ (PM MODI) ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇప్పటికే ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ పొంది, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారికి రూ.200 సబ్సిడీ కేంద్రం ఇస్తోంది. అలాగే ఇటీవల రక్షాబంధన్ (Rakshabandhan) సందర్భంగా మహిళలకు కేంద్రం తీపికబురు అందించింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.200 ధర తగ్గించారు. ఈ క్రమంలో కేంద్రం మరో గుడ్ న్యూస్ అందించడం గమనార్హం.