Ramayan : రామాయణం ఆధారంగా ఎన్ని సీరియల్స్, సినిమాలు వచ్చినా.. ఆ పేరు చెప్పగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది రామానంద్ సాగర్ ‘రామాయణం’ సీరియల్. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన ఆ సీరియల్ ఇప్పుడు మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని దూరదర్శన్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘రాముడు మరోసారి నీ ముందుకు వస్తున్నాడు. దేశవ్యాప్తంగా అత్యధిక వీక్షకులను అందుకున్న ‘రామాయణం’ త్వరలో దూరదర్శన్లో ప్రసారం కానుందని పేర్కొంది. ఇందులో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా నటించారు. లక్ష్మణ్ పాత్రలో సునీల్ లహరి తన నటనతో అందరినీ ఆకర్షించాడు.
‘రామాయణం’ సీరియల్ మళ్లీ ప్రసారం కావడం ఇది రెండోసారి. ఈ సీరియల్ మొదటిసారిగా దూరదర్శన్లో 25 జనవరి 1987 నుండి 31 జూలై 1988 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రసారం చేయబడింది. ఆ తర్వాత కోవిడ్ కాలంలో 2020 మార్చి 28 నుండి ప్రతి ఉదయం, సాయంత్రం ప్రసారం చేయబడింది. ఈ సీరియల్ మరోసారి ప్రసారం కానుంది. ఇటీవలే అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామాయణంలోని రాముడు, సీత, లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. రామాలయంలో శ్రీరాముని ప్రతిష్ఠాపన అనంతరం మరోసారి ప్రసారం చేయాలనే డిమాండ్ వచ్చింది. అది ఇప్పుడు నెరవేరుతోంది.