KRNL: చెక్ బౌన్స్ కేసులో నేరం రుజువవడంతో ఆదోనికి చెందిన బసిరెడ్డికి కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 2020లో హరినాథబాబు రూ. 6 లక్షలు అప్పుగా ఇవ్వగా, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్ బ్యాంకులో బౌన్స్ అయింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం నిందితుడికి నిన్న శిక్ష వేసింది.
CTR: పాలసముద్రం మండలంలోని 2024-25 సంవత్సరంలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న డీపీఎల్ లిక్కర్, సారాను ఎక్సైజ్ ఏఈఎస్ కృష్ణ కిషోర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ధ్వంసం చేశారు. స్టేషన్ పరిధిలో 24 కేసుల్లో 331 లీటర్ల సారాయి, ఆరు కేసుల్లో 34.38 లీటర్ల డీపీఎల్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశామని వారు తెలిపారు.
NLR: కందుకూరు (M) కొండముడుసుపాలెం హైవే సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరాయకొండ వైపు నుంచి కడపకు వెళ్తున్న బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని ఏరియా వైద్యశాలకు తరలించారు.
VZM: బొబ్బిలిల్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్వీట్ షాపును ఎమ్మెల్యే బేబినాయన పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను షాపు యజమాని, అగ్నిమాపక అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో షాపులో మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నుంచి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
SS: ధర్మవరంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయ పరిసరాలు, ప్రధాన కూడళ్లలో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీమ్స్, ట్రాఫిక్, సివిల్ పోలీసులతో ప్రత్యేక బృందాలను నియమించారు.
కోనసీమ: జిల్లాలో ఇంధన పరిస్థితి మెరుగ్గా ఉందని జాయింట్ కలెక్టర్ నిడియా దేవి తెలిపారు. జిల్లాలోని 110 బంకులకు గాను 100 బంకుల్లో విక్రయాలు జరుగుతున్నాయన్నారు. గత ఏప్రిల్లో రోజువారీ వినియోగం 200 లక్షల కిలో లీటర్లు ఉండగా, ప్రస్తుతం అది 350 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు అధికంగా నిల్వ చేసుకోవడం వల్లే ఈ వ్యత్యాసం అన్నారు.
ATP: వైసీపీ పాలనలో రాయలసీమలోని 102 సాగునీటి ప్రాజెక్టులను జగన్ రద్దు చేశారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. హంద్రీనీవా కోసం నాడు టీడీపీ రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కనీసం రూ. 2 వేల కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు.
KKD: ఎండల తీవ్రతతో ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తుండగా, ప్రత్తిపాడులో కొందరు వ్యాపారులు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం ఓ వ్యక్తి కొనుగోలు చేసిన డ్రింక్ బాటిల్పై గడువు ముగిసి ఉండటంతో ఈ విషయం వెలుగుచూసింది. దీనిపై ప్రశ్నిస్తే షాపు యజమానులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
BPT: పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో బస్సులు ఆగక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కొనసాగుతోంది. రోడ్డుమార్జిన్‌లో నిలబడి ఉన్న మహిళలు, చిన్నారులను చూసినా కొన్ని బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ATP: గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామంలో రైతు చిన్న నారాయణ కు చెందిన పొట్టేళ్ల గుంపుపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 40 పొట్టేలు మృతి చెందాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రైతు మాట్లాడుతూ.. పొట్టేళ్లు పెంచుతూ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపారు. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు కన్నీరు మున్నీరయ్యాడు.
SKLM: ఆమదాలవలస పురపాలకసంఘం పరిధిలోని 23 వార్డుల్లో ఇళ్ల ఇచ్చిన కుళాయిలకు మోటార్లు బిగిస్తే చర్యలు తీసుకుంటామని మునిసిపల్ కమిషనర్ తమ్మినేని రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. మోటార్లు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NDL: రాష్ట్రంలో గ్రామీణ రహదారులు, వంతెనల నిర్మాణాలు, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,085 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వేర్వేరు జీవోలు జారీ చేశామన్నారు. పనులు సకాలంలో పూర్తిచేయడానికి నాలుగు క్వార్టర్ల నిధులను ఒకేసారి కేటాయించామని, ప్రణాళిక ప్రకారం విభాగాధిపతులు నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు.
W.G: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని మాజీ సీఎం జగన్ ఇప్పుడు పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడిందంటూ నానా యాగీ చేయడం ఎంతవరకు సమంజసం అని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు. మంగళవారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిత్యం సమీక్ష చేస్తూ కొరతను అధిగమించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
VSM: పెట్రోల్, డీజిల్ సంక్షోభం నేపథ్యంలో కొత్తవలస మండల తహసీల్దార్ రమాలక్ష్మీ, డి.టీ చిరంజీవి సంయుక్తంగా అరకు విశాఖ ప్రధాన రహదారిలో ఉన్న పెట్రోల్ బంకును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా నిల్వల రిజిస్ట్రార్ ను తనిఖీ చేశారు. వాహనదారులకు మాత్రమే పెట్రోలో వేయాలని, డబ్బాలు, బాటిల్స్ వేయకూడదని నిర్వాహకులకు సూచించారు.ఆమె వెంట ఆర్. ఐ షణ్ముఖరావు ఉన్నారు.
PLD: కారంపూడి మండలంలో డీజిల్ కొరత ఉందన్న ప్రచారం అసత్యమని తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ఆరు పెట్రోల్ బంకులను ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. సరఫరా సజావుగా కొనసాగుతోందని తెలిపారు. పెద్ద వాహనాలకు రూ. 2వేలు, ద్విచక్ర వాహనాలకు రూ. 200 మేర ఇంధనం అందించాలని ఆదేశించారు.