BPT: పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనగల్లు గ్రామంలో జూదం జరుగుతోందన్న సమాచారం మేరకు ఎస్సై తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4,930 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
KRNL: ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీక్షించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధిపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆసక్తిగా వీక్షించారు. మహిళలకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తోందన్నారు.
VSP: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డా. కేఎన్ఆర్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, కన్వీనర్ పొలిమేర శ్రీనివాస్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి వినతులు స్వీకరించారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
AKP: టీడీపీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు తెలిపారు. ఇవాళ కే కోటపాడు మండలం గొట్లం, శృంగవరంలో పర్యటించి కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పూర్తితో ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం: జరుగుమల్లికి చెందిన వైసీపీ నాయకుడు కొండూరి హర్షవర్ధన్ రెడ్డికి కీలక పదవి దక్కింది. ఆయన YCP స్టేట్ వాలంటరీ వింగ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం జరుగుమల్లి వైసీపీ మండల అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసరావుతో పలువురు నాయకులు ఆదిమూలపు సురేశ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ATP: జిల్లా కలెక్టరేట్లో సోమవారం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆవిష్కరించారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, కర్మాగారాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలు పాటించాలని కోరారు.
PPM: జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ SV మాధవ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఫిర్యాదులను SP క్షుణ్ణంగా పరిశీలించారు.
కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం పరిధిలో నడిపూడి నుంచి వచ్చే పంపింగ్ మెయిన్ నిర్వహణ పనుల కారణంగా ఏప్రిల్ 14 సాయంత్రం, ఏప్రిల్ 15 ఉదయం మంచినీటి సరఫరా నిలుపుదల చేయబడుతుందని మునిసిపల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి పట్టణ ప్రజలు ముందుగా నీటిని నిల్వ చేసుకోవాలని కోరారు.
కృష్ణా: పామర్రు, గుడివాడ నియోజకవర్గాల ముదినేపల్లి మండలం మీదుగా రూ.7.72 కోట్లతో ప్రవహించే కొమరోలు మేజర్ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
E.G: అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ధవలేశ్వరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు తక్షణం అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10,000 స్టైఫండ్, 55 ఏళ్లు నిండిన న్యాయవాదులకు రూ.15,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు.
KRNL: ఆదోనిలో ఓటర్ల జాబితా సవరణలో లోపాలున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి వీరేశ్ సోమవారం తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఒకే కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. సరైన వార్డుల్లో పేర్లు నమోదు చేయాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని CPI నాయకులు హెచ్చరించారు.
W.G: పొదుపు సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న వీవోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సోమవారం వీరవాసరం మండల పరిషత్ కార్యాలయం వద్ద వీవోఏలు నిరసన చేపట్టారు. విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని, ఇతర ఇబ్బందులను వివరిస్తూ ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘నారీ శక్తి’ వందన్ అధినియంపై ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం.ధర్మారావు మాట్లాడుతూ.. మహిళలకు లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో 33% రిజర్వేషన్ కల్పించే ఈ చట్టం 2029 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. 2044 వరకు మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరిగి దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
గుంటూరులో ఏపీ టీఎంసీ కాటన్ కాన్సారియం జిన్నింగ్ & ప్రెస్సింగ్ ఫ్యాక్టరీస్ జనరల్ బాడీ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎల్చూరి వెంకటేశ్వర్లు ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఉప్పుటూరి సాంబశివరావు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా, ఇతర పదవుల్లో పలువురు నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
తిరుపతి నుంచి విమానాశ్రయం వెళ్లే మార్గంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. కాలువలో నీటి లోతు తక్కువగా ఉండటంతో డ్రైవర్ బాబు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.